గీతిక ఆత్మహత్య: ఫ్యామిలీకి ఫోన్‌కాల్స్, కందా విచారణ

కందాను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు అతనినిని విచారించేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు కోర్టు కందాను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. వారు కందా నుండి నిజాలు కక్కించే పనిలో పడ్డారు. ఆయనను తొలి రోజు విచారించారు. గూర్గావ్‌లోని తన కార్యాలయానికి కందాని తీసుకు వెళ్లి పోలీసులు తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన పలు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఏడు రోజుల కస్టడీలో ఆయన నుండి పూర్తి వివరాలు కూపీలాగే పనిలో పోలీసులు పడ్డారు.
కాగా మరోవైపు గీతిక కుటుంబ సభ్యులు తమ ఇంటికి తప్పుడు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు శనివారం మూడు ఫోన్ కాల్స్, శుక్రవారం ఐదు ఫోన్ కాల్స్ గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చాయని తెలిపారు. అవతలి నుండి ఫోన్స్ చేస్తున్న వ్యక్తి సెల్ ఫోన్ నుండి మాట్లాడినప్పుడు ఏమీ మాట్లాడటం లేదని, కానీ తమ ఇంటి ల్యాండ్ లైన్‌కు చేసినప్పుడు మాత్రం గీతిక గురించి అడిగారని గీతిక సోదరుడు అంకిత్ చెప్పారు.
తమకు ఫోన్‌లు రావడం వెనుక కందా హస్తం ఉండవచ్చునని, గీతిక ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకో లేదా విచారణ కొనసాగకుండా చేసేందుకే ఇలా చేస్తుండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. తాము ఇంటిలో ముగ్గురం మాత్రమే ఉంటామని, తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ కారణంగానే తాము శనివారం కందాను చూసేందుకు కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చిందని, తాను జాబ్ పోర్టల్ నుండి కాల్ చేస్తున్నానని, గీతికతో మాట్లాడాలని చెప్పారని, ఆ కాల్ వచ్చింది ల్యాండ్ లైన్‌కని, కానీ తమ ల్యాండ్ లైన్ నెంబర్ బంధువులు, స్నేహితులకు తప్ప ఇంకెవరికీ ఇవ్వలేదని అలాంటప్పుడు కాల్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!