పేలుళ్లు: భత్కల్, మరో 9 మందిపై అరెస్టు వారంట్
న్యూఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఢిల్లీ కోర్టు మంగళవారం ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్‌పై, మరో తొమ్మిది మందిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 16 మంది మరణించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్‌లో ఉంటున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మోసిన్ చౌదరి, అమీరి రేజా ఖాన్, డాక్టర్ షాహనవాజ్ ఆలం, అసదుల్లా అక్తర్, అరిజ్ ఖాన్, మొహ్మద ఖలీద్, మీర్జా షాదాబ్ బేగ్, మొహ్మద్ సాజిద్‌లపై జిల్లా న్యాయమూర్తి ఐఎస్ మెహతా నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేశారు. వీరందరూ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందినవారని అంటున్నారు.
విచారణ సందర్బంగా ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన సయ్యద్ మక్బూల్‌ను, ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఐదు రోజుల ఎన్ఐఎ కస్టడీ ముగిసిపోవడంతో వారిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి మార్చి 13వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మక్బూల్‌ను, ఇమ్రాన్‌ను హైదరాబాదుకు తీసుకుని వెళ్లామని, వారు విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారని ఎన్ఐఎ అధికారులు కోర్టుకు చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందినవారే కుట్ర చేశారని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బెంగళూర్ జైలులో ఉన్న ఓబెయి - ఉర్ - రెహ్మాన్ కోసం ఐఎన్ఎ ప్రొడక్షన్ వారంట్ జారీకి దరఖాస్తు చేసుకుంది. రియాజ్ భత్కల్ సూచన మేరకే హైదరాబాదు పేలుళ్లు జరిగినట్లు ఎన్ఐఎ కోర్టుకు తెలిపినట్లు సమాచారం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!