రెండు పడవలపై దాడి కాలు: జగన్ హామీ, కాంగ్రెస్ గాలం

ఎమ్మెల్సీ పదవి ఇవ్వక పోవడంతో అలక వహించినప్పటి నుండే దాడి ఇటు కాంగ్రెసు ఆటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో చర్చలు జరుపుతున్నారట. కాంగ్రెసు పార్టీ నుండి ప్రధానంగా మంత్రి గంటా శ్రీనివాస రావు మధ్యవర్తిత్వం వహించారట. దాడితో గంటా ఇటీవల భేటీ అవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో జగన్ పార్టీ నేతలతోను భేటీ అవుతున్నారట. తనకు ప్రాధాన్యత, తన తనయుడు కోరుకున్న నియోజకవర్గంపై హామీ ఇచ్చే పార్టీ వైపు మొగ్గు చూపేందుకు దాడి చర్చలు జరిపారట.
దీనిపై కొద్ది రోజుల క్రితమే స్పష్టత వచ్చినప్పటికీ పదవి కాలం ముగియడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జగన్ పార్టీ దాడి తనయుడు దాడి రత్నాకర్‌కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమ సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెసు మాత్రం దాడి కోసం ప్రయత్నాలు మానటం లేదట. ఇప్పటికే ఉన్న వారిని కాదని రత్నాకర్‌కు హామీ ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో వారికి ప్రత్యామ్నాయం చూపించి కాంగ్రెసులోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దాడి ఇప్పుడు జగన్ పార్టీ, కాంగ్రెసులు అనే రెండు నావలపై కాలు పెట్టారంటున్నారు.












Click it and Unblock the Notifications