వర్మ యూటర్న్? పవన్ పై ట్వీట్ డిలీట్- సంబంధం లేదంటూ..!
గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తాను పోటీ నుంచి తప్పుకుని పూర్తి స్దాయిలో మద్దతు ఇచ్చి గెలిపించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మలో ఆ తర్వాత అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కోసం తనను పోటీ నుంచి తప్పించి ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చి తప్పిన చంద్రబాబుతో పాటు తనను దూరం పెడుతున్న జనసేనపై ఆయన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారు.
ఇదే క్రమంలో వర్మ తాజాగా ఎక్స్ లో ఓ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ మాత్రం లేరు. వీడియోల కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ ను గెలిపించాననే అర్ధం వచ్చేలా ఉంది.

దీంతో వర్మ తీరుపై జనసైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించే వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ ను డిలీట్ కొట్టేశారు. అంతే కాదు ఈ ట్వీట్ తో తనకు సంబందం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీమ్ నుంచి వచ్చిందంటూ తేల్చేశారు.
నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాదు లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.ఈరోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో కి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని (1/2)
— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025
వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దానిని డిలీట్ చేపించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది. (2/2)
— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025
ఎక్స్ లో వివరణతో ఆ ట్వీట్ కూ తనకూ ఎలాంటి సంబంధం లేదంటూ వర్మ తేల్చిచెప్పేశారు. అయితే వర్మలో అసంతృప్తి ఏ స్ధాయిలో ఉందన్నది పిఠాపురంలో ఆయన సన్నిహితుల్ని అడిగితే చెప్తున్నారు. గత కొంతకాలంగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా జనసేన నాయకులుగా చెలామణి అవుతున్న వారు తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందులో నుంచే ఈ ట్వీట్ బయటికి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ట్వీట్ వైరల్ కావడంతో రాజకీయంగా ఇబ్బంది అని గమనించి ప్రస్తుతానికి తొలగించినా భవిష్యత్తులో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications