చంద్రబాబు హెలికాఫ్టర్ పరిస్ధితి ఏంటి ? అధ్యయనానికి కమిటీ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెలికాఫ్టర్ వాడకం వీరికి అంత సురక్షితం కాదన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఇవాళ సీఎం సహా వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ సామర్ధ్యంపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.
సీఎం చంద్రబాబు సహా వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ సామర్ధ్యంపై అధ్యయనం కోసం సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ప్రభుత్వం ఇవాళ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నలుగురు సభ్యుల్ని నియమించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ సామర్ధ్యం ఎలా ఉంది, ఒక వేళ మారిస్తే ఎలాంటి హెలికాప్టర్ ఉండాలనే అంశంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

సీఎం హెలికాఫ్టర్ ఫిట్ నెస్ అధ్యయన కమిటీలో సభ్యులుగా ఆర్ధిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఎడిజి, పౌర విమానయాన శాఖ నుంచి ఒక ప్రతినిధి ఉంటారని ప్రభుత్వం తెలిపింది. రెండు నెలల్లో ఈ కమిటీ సీఎం హెలికాఫ్టర్ ఫిట్ నెస్ పైనివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో ఈ కమిటీ త్వరలో దీనిపై అధ్యయనం చేపట్టబోతోంది. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ నల్లమల అడవుల్లో కూలిన నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ పై ప్రభుత్వం అధ్యయన కమిటీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications