Free Gas Cylinders: ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్ల బుకింగ్ మొదలు-ఇలా బుక్ చేసుకోండి..!
ఏపీలో గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలుకు కూటమి సర్కార్ తొలి అడుగు వేసింది. ఈ దీపావళి నుంచి పథకం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభించింది. చంద్రబాబు ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సోంపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఇందులో తొలి విడతగా రూ.894.92 కోట్లను విడుదల చేసేందుకు నిన్న అనుమతి ఇచ్చింది. ఈ నిధులు త్వరలో విడుదల కానున్నాయి.ఈ నెల 31న సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభించగానే.. రాష్ట్రవ్యాప్తంగా తొలి సిలెండర్ ఇళ్లకు డెలివరీ ప్రారంభం అవుతుంది. వీటికి బుకింగ్స్ ఇవాళ ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో సిలెండర్లు ఎలా బుక్ చేసుకోవాలన్నది సూచిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం లబ్దిదారులు గ్యాస్ సిలెండర్లను తమ గ్యాస్ కంపెనీ (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఇండేన్ గ్యాస్) వెబ్ సైట్ లో కానీ, మొబైల్ ఫోన్లో ఐవీఆర్ నంబర్ కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేలో కానీ, వాట్సాప్ లో కానీ, గ్యాస్ కంపెనీ డిస్టిబ్యూటర్ ఆఫీసు వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ తర్వాత లబ్దిదారుడి ఫోన్ కు సిలెండర్ బుక్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. గ్యాస్ డీలర్ వద్ద సిలెండర్ డెలివరీ కోసం బిల్ జనరేట్ అవుతుంది. సిలెండర్ లబ్దిదారుడికి డెలివరీ చేసేటప్పుడు ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది చెప్తే డెలివరీ బాయ్ సిలెండర్ ఇస్తారు. సిలెండర్ డెలివరీ తర్వాత డిస్టిబ్యూటర్ వెబ్ సైట్ లో ఈ వివరాలు అప్ డేట్ చేస్తారు. వెంటనే లబ్దిదారుడికి సిలెండర్ డెలివరీ అయినట్లు మరో మెసేజ్ వెళ్తుంది. ఆ తర్వాత 24 గంటల్లో గ్యాస్ సిలెండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుడి ఖాతాలో జమ అవుతుంది.












Click it and Unblock the Notifications