ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు- ఎస్ఈసీ కీలక నిర్ణయం..!
ఏపీలో జరుగుతున్న స్దానిక సంస్ధల ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా 19 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, వీటిపై వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు పేరుతో మొత్తం 100 చోట్ల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ ఆపేయడం జరిగాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ఇవాళ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత అధికారులతో మూడు గంటల పాటు భేటీ అయిన ఎస్ఈసీ.. మున్సిపల్ ఎన్నికలకు (AP Municipal Elections) కొత్త తేదీని ఖరారు చేశారు.
ఏపీలో మొత్తం 100 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో మైదుకూరు మినహా మిగిలిన 99 స్ధానాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ తేదీని ఖరారు చేసింది. గతంలో అక్టోబర్ 28న ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని భావించిన ఎస్ఈసీ.. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని కాస్తా నవంబర్ 1కు మార్చింది. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని, ఆ తర్వాతే విడిగా పోలింగ్ తేదీని ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో 99 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల తుది జాబితాలను ఖరారు చేస్తారు. అలాగే నవంబర్ 1న ఈ 99 స్ధానాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న ఓట్లు లెక్కింపు చేపట్టి, ఫలితాలు విడుదల చేస్తారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తవుతుంది. మైదుకూరు స్ధానంతో పాటు కోర్టులో ఉన్న 23 స్ధానాల్లో కేసుల పరిష్కారం తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ లో నామినేషన్ల పొడిగింపుపై ఇవాళ సాయంత్రం లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. ఎస్ఈసీ మాత్రం పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే పొడిగింపు లేనట్లేనని భావిస్తున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీల్లోనూ మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల గడువు పొడిగించని ఎస్ఈసీ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
