ఏపీలో ఆ 19 చోట్ల మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ ? సుప్రీం ఆదేశాల వేళ .!
ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న 19 పట్టణ స్థానిక సంస్దల్లో ఎన్నికల్ని తాత్కాలికంగా వాయిదా వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP SEC) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో నామినేషన్ల గడువు పెంచాలంటూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ మీద కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో హుటాహుటిన సమావేశమైన రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల నుంచి అధికారుల నివేదికలు కోరింది.
రాష్ట్రంలో ఈ నెలలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ముగిసింది. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదని, ఎస్ఈసీకి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదంటూ విపక్ష పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే రాష్ట్రంలో 19 పట్టణ స్దానిక సంస్థల్లో విపక్ష అభ్యర్ధులకు కూడా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ గడువు పొడిగించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇవాళ ఎస్ఈసీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.

వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసిన 19 స్ధానాల్లో నామినేషన్ల గడువు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని, రేపు సాయంత్రం కల్లా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. అలాగే ఈ నెల 25 వరకూ నామినేషన్ల తుది జాబితా ఖరారు చేయవద్దని ఆదేశించింది. ఎస్ఈసీ తీసుకున్న చర్యల నివేదికను తదుపరి విచారణలో తమకు సమర్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ ఆత్మరక్షణలో పడింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయకుండా హడావిడిగా చర్యలు తీసుకునే పరిస్ధితి లేకపోవడంతో 19 సీట్లలో మున్సిపల్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ఆయా సీట్లలో నామినేషన్ల ప్రక్రియ, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇవాళ రాత్రికి జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల నివేదికలు వచ్చాక అధికారికంగా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
