బెంగళూరు రేవ్ పార్టీ.. ప్రధాన సూత్రధారి ఇతనే.. నిందితుల ఫోన్లలో షాకయ్యే విషయాలు!!
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . బెంగళూరు నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్ లోనూ సంచలనంగా మారింది. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పార్టీలో పట్టుబడిన ప్రముఖులు ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.
కీలక సూత్రధారి ఇతనే
ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఐదుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి తాజాగా అనేక కీలకవిషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి కీలకసూత్రధారి విజయవాడకు చెందిన లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ వన్ టౌన్ ఏరియాలోని కొత్తపేట ఆంజనేయవాగుకు చెందిన వాసుకు విజయవాడలో కూడా పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా గుర్తించారు.

బెట్టింగ్స్, డ్రగ్స్ .. చీకటి దందాలు చేసే లంకపల్లి వాసు
లంకపల్లి వాసు అనేక చీకటి దందాలు చేస్తున్నట్టు, రకరకాల వ్యాపారాలు, ఫార్మా మాటున ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు ఇతను బెట్టింగ్లకు కూడా పాల్పడినట్టు, పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ లలో ఈ మేరకు అనేక షాకింగ్ అంశాలను గుర్తించినట్టు తెలుస్తోంది.
నిందితుల ఫోన్లలో ఏపీ పోలీసుల నెంబర్లు
అంతేకాదు నిందితుల మొబైల్ ఫోన్లలో ఏపీ పోలీసుల నెంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఏపీ పోలీసులతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన 101మందిలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఐదుగురిని మినహాయించి, మిగతా వారందరికీ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న టెస్టులు నిర్వహించారు. వారందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అవసరమైనప్పుడు విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపినట్టు సమాచారం.
రేవ్ పార్టీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు
ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న సిద్ధికి, రణధీర్, రాజ్ భవ్ లను పోలీసులు డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించి ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు నమోదు చేశారు. మొత్తం తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమకు చెందినవారు, సీరియల్ నటీనటులు 20 మందికి పైగా మోడల్స్, మొత్తం 30 మంది యువతులు, 70 మంది యువకులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications