YS Sharmila: అదే వైఎస్ షర్మిల- ఏపీ, తెలంగాణ మధ్య ఎంత తేడా ?
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు. దీంతో వైఎస్సార్ కుమార్తె కాస్తా తిరిగి కాంగ్రెస్ మనిషి కాబోతున్నారు. దీంతో ఏపీలో ఆమెపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదంతా తమకు లాభిస్తుందని కాంగ్రెస్ కూడా భారీగా లెక్కలేసుకుంటోంది.
అయితే తెలంగాణలో భారీ లెక్కలతో ఎన్నికలకు ఏడాది ముందే వైఎస్సార్టీపీని స్ధాపించిన వైఎస్ షర్మిలకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ముఖ్యంగా తన సామాజికవర్గమైన రెడ్లు, వైఎస్సార్ అభిమానులు, ప్రజాప్రతినిధులు, మాజీలు తన పార్టీలోకి క్యూ కడతారని భావించినా అలా జరగలేదు. దీంతో తృతీయశ్రేణి నాయకులతోనే వైఎస్సార్టీపీని నడిపించాల్సిన పరిస్దితి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కాస్తో కూస్తో పేరున్న నేతలు కూడా షర్మిలవైపు చూడలేదు. దీంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం లీకులతో మొదలైన చర్చ కాస్తా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీకి మద్దతిచ్చే వరకూ వెళ్లి ఆగింది.

సీన్ కట్ చేస్తే అదే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధం కావడం, ఢిల్లీలో ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ మకాం వేసి కాంగ్రెస్ పెద్దలతో వరుసగా జరిపిన చర్చలు ఫలించి ఎట్టకేలకు ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకూ వెళ్లింది. అంతే కాదు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని తెలియగానే ఏపీ కాంగ్రెస్ లో ఎక్కడలేని ఊపు వచ్చింది. పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు ఆమె కోసం తన సీటు వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలతో కాంగ్రెస్ నేతలంతా ఆమె రాకను స్వాగతిస్తున్నారు.
అంతే కాదు వైఎస్సార్సీపీలో ఇన్ చార్జ్ ల మార్పుతో సీట్లు కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు ఆమెకు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెకు జై కొట్టి ఇవాళ జగన్ ఇంటికి కూడా ఆమెతో పాటే వెళ్లారు. ఇదే బాటలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఉన్నారు. అలాగే పలువురు వైసీపీ నేతలు ఆమె చేరాక కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో షర్మిలకు లభిస్తున్న ఆదరణ ఆమెను కూడా ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తోంది.












Click it and Unblock the Notifications