భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పుణ్యక్షేత్రాల బాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు నేతలందరూ ఎవరికి వారు కాస్త రిలీఫ్ అవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు తన పర్యటనకు సంబంధించి సిబిఐ అనుమతి కూడా తీసుకున్నారు. సీఎం జగన్ మే 17 నుండి జూన్ 1 వరకు ఫ్రాన్స్, స్విట్జర్ల్యాండ్ లో కుటుంబ సమేతంగా పర్యటించనున్నారు.
పుణ్య క్షేత్రాల బాట పట్టిన చంద్రబాబు
పవన్ కళ్యాణ్ సైతం భార్య అన్నా లెజ్నేవాతో కలిసి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో పుణ్యక్షేత్రాల బాట పట్టారు. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రస్తుతం పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తున్నారు. నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు.

షిరిడీ వెళ్తున్న చంద్రబాబు దంపతులు
కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీలో సాయిబాబాని దర్శించుకోవడానికి బయలుదేరారు. నేడు షిరిడి సాయినాధుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు ఇటీవల కాలంలో ఎక్కువ ఎక్కువగా పూజలు పునస్కారాలపైన ధ్యాస పెట్టినట్టుగా కనిపిస్తుంది.
చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చాక తరచూ తీర్ధయాత్రలు
గత సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 53 రోజులపాటు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి అనేక ఆలయాలలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఇక చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.
మొన్నటిదాకా ఎన్నికల బిజీ.. ఇప్పుడు పుణ్య క్షేత్రాల సందర్శన
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో బిజీగా గడిపిన చంద్రబాబు, ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఇక తాజాగా ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో మళ్లీ సతీమణితో కలిసి పుణ్యక్షేత్రాల బాట పట్టారు.












Click it and Unblock the Notifications