NTR వర్సిటీకి వైఎస్సార్ పేరా ? ఆయనకేం సంబంధం ? పేర్లు మారిస్తే పేరు రాదన్న చంద్రబాబు
అమరావతి : విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ పేరుతో మార్చడాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తప్పుబట్టింది. ఇవాళ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై నిరసన కొనసాగిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమన్నారు.
1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనమని చంద్రబాబు విమర్శించారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు.. ఆయన మరణానంతరం 1998లో టీడీపీ ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.(1/5) pic.twitter.com/y3oSAdHgYw
— N Chandrababu Naidu (@ncbn) September 21, 2022
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదని సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని చంద్రబాబు పేర్కొన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మారుస్తుందన్నారు.
హెల్త్ వర్సిటీ కి చెందిన రూ.450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన వైసీపీ ప్రభుత్వం ఏ హక్కుతో పేరు మార్చుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి...వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అని చంద్రబాబు నిలదీశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందన్నారు.

దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదన్నారు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సిఎం జగన్ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications