ఏపీకి రేపు భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు..!
మురసు తుఫాన్ (Cyclone Murasu) తీరం దాటిపోయినా ఆంధ్రప్రదేశ్ పై దీని ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తుపాన్ తీరం దాటాక బలహీనపడుతున్నా.. ఇంకా పూర్తిగా దీని ప్రభావం తగ్గలేదు. ఈ నేపథ్యంలో రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. పలు చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఆయా ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
రేపు రాష్ట్రంలోని విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారరు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, మునిగిపోయిన కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు.

ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 182.5 మి.మీ వర్షం కురిసింది. ఇదే జిల్లాలోని జీలుగుమిల్లిలో 139.63 మి.మీ., పి.నారాయణపురంలో 128.75 మి.మీ, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 126.25 మి.మీ., పెదపూడిలో 123.69 మి.మీ., ఏలూరు జిల్లా నూతిరామన్నపాలెంలో 122.0 మి.మీ, కాకినాడ జిల్లా కాజులూరులో 121.08 మి.మీ. కరపలో 120.25 మి.మీ, వేళంగిలో 114.01 మి.మీ, జి.మామిడలో 112.75 మి.మీ వర్షపాతం రికార్డయ్యాందని అధికారులు వెల్లడించారు. రేపు కూడా ఆయా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి.













Click it and Unblock the Notifications
