వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ ఒంటరి కాడు, ఆంధ్రాలో ఉన్నామా.. పాక్‌లోనా: దాసరి, తోడు చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాపు ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం సమావేశమై తాజా పరిస్థితి సమీక్షించారు.

సమావేశానంతరం దాసరి నారాయణరావు, చిరంజీవి తదితరులు మీడియాతో మాట్లాడారు. కాపుల్లో చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని దాసరి నారాయణ రావు మండిపడ్డారు. ముద్రగడ ఒంటరివాడు కాడని, తామంతా ముద్రగడ వెంట ఉన్నామని ఆయన చెప్పారు. ముద్రగడ వెంట యావత్ జాతి ఉందని చెప్పారు.

ఒకప్పుడు వంగవీటి రంగాను పోగొట్టుకున్నామని, ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకోవడానికి సిద్దంగా లేమని ఆయన చెప్పారు. ముద్రగడను కలవనీయకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆంధ్రాలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ముద్రగడపై తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలతో బురద చల్లించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Dasari - chiranjeevi

తుని ఘటనల వెనక రాయలసీమ వాళ్లు ఉన్నారని చంద్రబాబు గతంలో అన్నారని, ఇప్పుడు గోదావరి వాసులపై కేసులు పెట్టడం ఏమిటని చిరంజీవి అన్నారు. ముద్రగడ అడకూడనిది ఏదైనా అడుగుతున్నారా, మానిఫెస్టోలో పెట్టిందే అమలు చేయాలని అడగడం నేరమా ఆయన అన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలపై తాము ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని దాసరి, చిరంజీవి అన్నారు. ముద్రగడకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. సమావేశంలో చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణలతో పాటు పల్లంరాజు, కన్నబాబు, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

గతంలో వంగవీటి రంగాను పోగొట్టుకున్నామని, ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోననే భయంతో తాము సమావేశమయ్యామని దాసరి చెప్పారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆయన అన్నారు. ఇది సామాజిక సమస్య అని, అయితే దాన్ని ఉగ్రవాద సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమని ఆయన అన్నారు.

ముద్రగడ దీక్షకు సంబంధించిన వార్తలను సేకరించి ప్రసారం చేస్తున్న మీడియాను కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కాపు సోదరసోదరీమణులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం ఎక్కడా జరగలేదని దాసరి అన్నారు.

ముద్రగడ చర్చలకు సిద్దమన్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందించి పరిష్కారం కనుక్కోవాలని ఆయన సూచించారు. ముద్రగడతో కాపు నేతలతోనే బురద చల్లించే కార్యక్రమాలు చంద్రబాబు కొనసాగిస్తే దానికి విరుగుడుగా తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని దాసరి హెచ్చరించారు.

ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చిరంజీవి హెచ్చరించారు. గత పది రోజులుగా ఎపిలో చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని, ఇది చాలా అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ముద్రగడ దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగులగొట్టి ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితిని కల్పించారని చిరంజీవి దుయ్యబట్టారు.

ముద్రగడ భార్య పట్ల, కోడలి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. తుని ఘటనను తాము ఎవరం కూడా సమర్థించడం లేదని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవారు ఎవరూ లేరని... పులివెందులకు చెందినవారే ఉన్నారని చెప్పారని, అలాంటిది ఇప్పుడు అక్కడి యువకులను నిర్బంధించి వాళ్లకు సంఘీభావం తెలిపినవాళ్లను జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యంపై తమ అందరికీ ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు.

English summary
Former union minister and Tollywood director Dasari Narayana Rao and Congress Rajya sabha member and Mega star Chiranjeevi lashed out at Andhra Pradesh CM Nara Chandrababu Naidu on Mudragada Padmanabham issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X