శ్రేణుల అభిమతానికి చెల్లుచీటి: టిడిపిలో అసమ్మతి సెగలు, బాబుకు చిక్కులే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి: మరో రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సార్వ్రతిక ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధి నాయకత్వం జిల్లాలకు నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించడంతో ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న వారు రగిలిపోతున్నారు.

సీనియర్లు.. తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారు అధినాయకత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే ప్రాణంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కేంద్ర పూసపాటి అశోక్ గజపతి రాజును విజయనగరం జిల్లాలో కట్టడి చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు వెనుకాడలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అందుకు తొలి నుంచి సన్నిహితుడిగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును ముందు పెట్టి తన పని పూర్తి చేయడంలో చాణక్యం ప్రదర్శించారు. తద్వారా రాష్ట్రమంతా తన పట్టు బిగించాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎక్కువగా వివాదం నెలకొన్నజిల్లాల్లో మాత్రం పార్టీ అధ్యక్షులను మాత్రం నియమించలేదు. నాయకత్వం పట్ల ఎక్కువగా విశ్వాసం చూపే వారికే ఆయా జిల్లాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో ఉన్న మరో వింత గుణమేమిటంటే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో అనిశ్చితిని, అభద్రతను కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కర్నూల్ అధ్యక్షుడిగా సోమిశెట్టి

కర్నూల్ అధ్యక్షుడిగా సోమిశెట్టి

వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్నూల్ జిల్లా నేత, మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవిపై పెట్టుకున్న ఆశలకు చంద్రబాబు చెక్ పెట్టారు. తొలి నుంచి సౌమ్యుడిగా ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. చిత్తూరు జిల్లాలో పదవులన్నీ ఒకే సామాజిక వర్గ నాయకులకు కట్టబెట్టడంపైనా జిల్లా తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. రాయలసీమ తర్వాత ఫ్యాక్షన్ కక్ష్యలకు నిలయంగా మారిన ప్రకాశం జిల్లాలో అందరికీ ఆమోద యోగ్యమైన దామరచర్ల జనార్ధన్‌ను తిరిగి నియమించారు.

వైజాక్ తమ్ముళ్లో డీసెంట్ ఇలా

వైజాక్ తమ్ముళ్లో డీసెంట్ ఇలా

ఉత్తరాంధ్రకు ముఖ ద్వారంగా ఉన్న విశాఖపట్నం రూరల్ జిల్లా విశాఖ రూరల్‌ అధ్యక్షుడిగా పంచకర్ల రమేశ్‌బాబు పేరు ప్రకటించడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్థానికేతరుడికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని విశాఖ పట్నం జిల్లా నేతలు పార్టీ అధిష్టానంపై గుస్సా అవుతున్నారు.

కేంద్ర మంత్రి అశోక్ ప్రతిపాదనలు భేఖాతర్

కేంద్ర మంత్రి అశోక్ ప్రతిపాదనలు భేఖాతర్

మిగతా జిల్లాల్లోనూ కొత్త అధ్యక్షుల నియామకంపై టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చిన్నమనాయుడును జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. మండలస్థాయి నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని సీనియర్లు గుర్రుమంటున్నారు. విజయ నగరం జిల్లాలో ఎవరేమనుకున్నా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పిందే వేదం. ఆయన మాటకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తూచ్‌ అనే ప్రశ్నే లేదు.. ఇదీ నిన్న మొన్నటి వరకూ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై టీడీపీ వర్గాల అభిప్రాయంగా ఉండేది. ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

అశోక్ గజపతి రాజు ప్రాభవం తగ్గుతుందా?

అశోక్ గజపతి రాజు ప్రాభవం తగ్గుతుందా?

కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు తన అనుంగు శిష్యుడిగా పేరొందిన ద్వారపురెడ్డి జగదీష్‌ పేరును విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి అశోక్‌ ప్రతిపాదించారని సమాచారం. ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో మహంతి చిన్నంనాయుడి పేరు ఖరారైంది. దీంతో అధిష్టానం వద్ద అశోక్‌ ప్రాభవం తగ్గిందని, జిల్లా తెలుగు దేశం పార్టీలో ఇక పెద్ద మార్పులే చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గంటా సారథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

గంటా సారథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కొన్నేళ్లుగా విజయనగరం జిల్లా పరిధిలో పార్టీ పదవులకు సంబంధించి అశోక్‌ గజపతిరాజు మాటకు అధిష్టానం ఎదురుచెప్పలేదు. అలా అని ఆయన అన్ని విషయాల్లోనూ కలుగజేసుకోలేదన్నది కూడా నిర్వివాదాంశం. అధికారంలో ఉన్నా లేకున్నా అశోక్‌కు ఆమాత్రం విలువను కట్టబెట్టిన అధిష్టానం ఇప్పుడు రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. విశాఖపట్నం జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడయితే ఇన్‌చార్జి మంత్రిగా జిల్లాలో అడుగుపెట్టారో అప్పటినుంచి ఈ వాదనకు మరింత బలం చేకూరిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక అంశంతోనే అశోక్‌ ప్రాభవంపై చర్చ జోరందుకుంది.

గంటా కోసమే చంద్రబాబు వ్యూహాత్మక వైఖరి

గంటా కోసమే చంద్రబాబు వ్యూహాత్మక వైఖరి

విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో చాలా వరకూ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. ఇందులో నెల్లిమర్ల ముందుంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పతివాడ నారాయణ స్వామినాయుడు వృద్ధాప్యం కారణంగా ఆయనను తప్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన కుమారులకు టిక్కెట్‌ ఇచ్చే ఉద్దేశం కూడా లేనట్టు బోగట్టా.

పతివాడకు ప్రత్యామ్నాయంగా గంటా?

పతివాడకు ప్రత్యామ్నాయంగా గంటా?

ఇటీవల విశాఖ జిల్లాలో వెలుగుచూసిన భూ కుంభకోణం భవిష్యత్‌లో పార్టీకి తీరని నష్టం చూకూర్చుతుందని భావించిన అధిష్టానం.. గంటా శ్రీనివాసరావుకు నెల్లిమర్ల టిక్కెట్టు ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గంటా ప్రాతినిధ్యానికి నెల్లిమర్లలో వ్యతిరేకత వస్తే మహంతి చిన్నం నాయుడినే కొనసాగించుకోవచ్చనే నిర్ణయంతో అధిష్టానం పావులు కదిపినట్టు భోగట్టా! మహంతి చిన్నంనాయుడి ఎంపిక నేపథ్యమిదేనని పార్టీ సీనియర్లు అంటున్నారు.

నామన వద్దన్నా ‘తూర్పు’ పార్టీ బాధ్యతలు

నామన వద్దన్నా ‘తూర్పు’ పార్టీ బాధ్యతలు

తూర్పు గోదావరి జిల్లాలో మరొక సమస్య. ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్‌గా ఉన్న నామన రాంబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. తనకు పార్టీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదని, అలాగే, జెడ్‌పీ పీఠాన్ని కూడా వదులుకునేది లేదని ఇప్పటికే నామన కరాఖండీగా చెప్పారు. మెజారిటీ జెడ్‌పీటీసీ సభ్యులు కూడా ఆయనను జెడ్‌పీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించవద్దని కోరారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎంతో కాలానికి వచ్చిన పదవిని వదులుకోవాలంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుందని చెప్పడానికి నామన ఒక చక్కని ఉదాహరణ. అందునా ఎటువంటి తప్పొప్పులు లేకున్నా, వైదొలగమంటే మనసుకు మరింత కష్టంగా ఉంటుంది. పైగా ఆ పదవిని తన కళ్లముందే మరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే.. పంచభక్ష్య పరమాన్నాలతో ఉన్న తన విస్తరిని ఎవరో తన్నుకుపోయినంత పరివేదన కలుగుతుందని నాయకులు, తెలుగు తమ్ముళ్లు అభిప్రాయ పడుతున్నారు.

వ్యతిరేకించిన జెడ్పీటీసీ సభ్యులు

వ్యతిరేకించిన జెడ్పీటీసీ సభ్యులు

తూర్పు గోదావరి జిల్లా నేతలు వద్దు వద్దన్నా ఆయనకు అధినేత చంద్రబాబు.. నామన రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలను అప్పగించారు. అసలు సంగతేమిటంటే ఆయన జెడ్‌పీ చైర్మన్‌ పీఠం నుంచి ఆయనను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి నామనను జెడ్పీ చైర్మన్ పీఠం నుంచి తప్పించి, ఆ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు, జగ్గంపేట జెడ్‌పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు అప్పగించేందుకు పార్టీ నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నామనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు.

ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొద్దని వినతులు

ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొద్దని వినతులు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు సమక్షంలో గత నెల 21న కాకినాడలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు జెడ్‌పీటీసీ సభ్యులు, పార్టీ నేతలు జెడ్‌పీ చైర్మన్‌ మార్పును వ్యతిరేకించారు. వివాదరహితుడైన నామన రాంబాబును ఆ పదవి నుంచి తప్పించవద్దని, దీనివల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వారి మనోధైర్యం దెబ్బ తింటుందని మొత్తుకున్నారు. అధికారాలు, నిధులు, విధులు లేకపోతే పోయే.. కనీసం తమకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పనులు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యసభకు సీతామహాలక్ష్మి ఇలా

రాజ్యసభకు సీతామహాలక్ష్మి ఇలా

పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సీతామహా లక్ష్మిని నియమించారు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో అందరితో సంబంధ బాంధవ్యాలు గల నేత ఆమె. 2009 ఎన్నికల సమయంలో పార్టీని ఒంటిచేత్తో ముందుకు నడిపించారు. ఆ ద్రుష్టితోనే ఆమెను రాజ్యసభకు పంపారు. గుంటూరు, క్రుష్ణా, విజయవాడ అర్బన్ జిల్లాల పరిధిలోనూ తెలుగు తమ్ముళ్లలో అసంత్రుప్తులు వ్యక్తమవుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Differences in Telug Desam party (TDP) cropped up after appointing district level leaders.
Please Wait while comments are loading...