టీడీపీ నుండి బయటకొచ్చిన వారిలో మంత్రి రోజా భిన్నం: ఎందుకో చెప్పి దివ్యవాణి ప్రశంసలవర్షం!!
టీడీపీ నుండి బయటకు వచ్చిన వారిలో రోజా భిన్నం అని చెప్పిన దివ్యవాణి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రోజాపై దివ్యవాణి ప్రశంసలవర్షం కురిపించారు.
ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరికి అనుకూలంగా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సీనియర్ నటి టిడిపి మాజీ స్పోక్స్ పర్సన్ అయిన దివ్యవాణి మంత్రి రోజాపై ప్రశంసలు జల్లు కురిపించారు. దీంతో ఇప్పుడు దివ్యవాణి వైసిపి తీర్థం పుచ్చుకోబోతున్నారా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ జీవితంపై స్పందించిన దివ్య వాణి
సీనియర్ నటి, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి, తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళ్లి.. ఆ తర్వాత టిడిపి రాజకీయాల నుంచి బయటకు వచ్చిన దివ్యవాణి ఇటీవల తన రాజకీయ జీవితంపై స్పందించారు. ఇంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ ను తెగ పొగిడేసిన దివ్యవాణి అప్పట్లో జనసేన తీర్ధం పుచ్చుకుంటారు న్న చర్చ జరిగింది. ఇక తాజాగా మంత్రి ఆర్కే రోజాపై దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్కే రోజాపై ప్రశంసల జల్లు కురిపించిన దివ్య వాణి
తెలుగుదేశం పార్టీ నుండి ఎందుకు బయటకు వచ్చారన్న ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన నటీమణులు తాను ఒక్కదాన్నే కాదని, గతంలో అనేకమంది వచ్చారని పేర్కొన్న దివ్యవాణి శారద, జయప్రద, జయసుధ, కవిత, రోజా ఇలా చాలామంది టిడిపి నుండి బయటకు వచ్చారని పేర్కొన్నారు. అక్కడ ఇమడలేక పోవడానికి ఎవరి కారణం వారికి ఉందని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మంత్రి ఆర్కే రోజాపై దివ్యవాణి ప్రశంసలు జల్లు కురిపించారు.

టీడీపీ నుండిబయటకు వచ్చిన వారిలో రోజా భిన్నం.. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన అందరూ మహిళా నటీమణులలో ఆర్కే రోజా మాత్రం భిన్నమని, టిడిపి నుండి బయటకు వచ్చినా .. రియల్ పొలిటీషియన్ గా మారి ప్రజలకు మంత్రిగా సేవ చేస్తున్నారని మంత్రి రోజాను ఓ రేంజ్ లో పొగిడేసారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లే నటీనటులను చాలామంది చిన్నచూపు చూస్తారని, వారికి జనంలో గౌరవం తగినంతగా ఉండదని పేర్కొన్న దివ్యవాణి, అయితే రోజా మాత్రం సినీ నటులు రాజకీయాల్లో రాణించగలరని రుజువు చేశారని, మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారని వ్యాఖ్యలు చేశారు.

అవకాశం వస్తే రోజాతో కలిసి పని చేస్తా
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా తాను కలిసి పని చేశామని చెప్పిన దివ్యవాణి తమ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రోజాతో కలిసి పనిచేయాల్సి వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తానని తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దివ్యవాణి స్పష్టం చేశారు. త్వరలోనే తన రాజకీయ ప్రయాణం పై మరో నిర్ణయం తీసుకుంటానని దివ్యవాణి తెలిపారు. దీంతో దివ్యవాణి తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె వైసిపి తీర్థం పుచ్చుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇప్పటినుండే తెలుగు నాట వచ్చే ఎన్నికల లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్న వేళ దివ్యవాణి దారెటు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications