పవన్ కు లక్కీ నంబర్ ఖరారైనట్లేనా ? సీట్ల నుంచి ప్రమాణం వరకూ అదే.. !
జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఓ పద్దతి ప్రకారం బీజేపీతో ముందుగా పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత టీడీపీతో జత జట్టడం, ఆ తర్వాత ఈ రెండు పార్టీలను కలపడం, ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలతో ఉమ్మడిగా ప్రచారం చేయడం, మ్యానిఫెస్టో పంచుకోవడం ఇలా ప్రతీ విషయంలోనూ పవన్ తీసుకున్న జాగ్రత్తలు కలిసొచ్చి ఇవాళ డిప్యూటీ సీఎంతో పాటు రెండు మంత్రిపదవుల్ని దక్కించుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కు అనుకోకుండా 21 సంఖ్య మాత్రం వెంటాడుతోంది. తొలుత చంద్రబాబు నుంచి పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకున్న పవన్ కు ఆ తర్వాత అందులో మూడు సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో జనసేన 21 సీట్లే తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురైంది. అయినా పవన్ చలించలేదు. పొత్తు ఉంటే చాలని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే గెలుపు తమదే అనుకున్నారు. దాని ఫలితంగా ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21కి 21 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.

అంతే కాదు ఇవాళ జూన్ 21న ఆ 21 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం కూడా చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కు 21 లక్కీ నంబర్ గా మారిపోయింది. పవన్ ఊహించకుండానే 21 నంబర్ తో ఆయనకు అనుబంధం ఏర్పడిపోవడం కాకతాళీయంగా కనిపిస్తోంది. దీంతో పవన్, జనసేన లక్కీ నంబర్ 21పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

మొదట్లో చంద్రబాబు నుంచి పవన్ 21 సీట్లు తీసుకున్నప్పుడు వైసీపీ శ్రేణులు ఆ నంబర్ పై ట్రోలింగ్ చేసేవి. రెండు సీట్లలో పోటీ చేసి ఒక్కటీ గెలవలేదని సింబాలిక్ గా 21ని చెప్పేవి. కానీ ఇప్పుడు పవన్ వరుస విజయాలతో ఆ 21 కాస్తా లక్కీ నంబర్ గా మారిపోయింది. దీంతో 21తో పవన్ ను, జనసేనను ట్రోలింగ్ చేసిన నోళ్లన్నీ ఒక్కసారిగా మూతపడినట్లయింది.












Click it and Unblock the Notifications