గాడిద పాల కుంభకోణం.. ఏపీ, తెలంగాణలో 100కోట్ల మోసం.. మ్యాటరేంటంటే
మార్కెట్లో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంటుంది. అయితే గాడిద పాల వ్యాపారం చేస్తే బోలెడు లాభాలు వస్తాయని కోట్లకు పడగలెత్తవచ్చని జనాలను యూట్యూబ్ వీడియోలతో మభ్యపెట్టి జాగ్రత్తగా ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో గాడిద పాల వ్యాపారం పేరుతో వందల మందిని బురిడీ కొట్టించాడు.
డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్.. బడా మోసం
100 కోట్లకు పైగా మోసం చేసిన ఘరానా మోసగాడి పైన ప్రస్తుతం బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్ లో బాబు ఉలగనాథన్ అనే వ్యక్తి డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలు పెట్టాడు.

గాడిద పాల వ్యాపారం పేరుతో ట్రాప్
లీటరు గాడిద పాలను 1600 రూపాయల నుంచి 1800 రూపాయలకు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. తనకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని కానీ డిమాండ్ కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతున్నానని ఎవరైనా తనకు గాడిదను సప్లై చేస్తే తీసుకుంటానని నెలకు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందంటూ యూట్యూబ్ ఛానల్ వీడియోలతో జనాలను నమ్మించాడు.
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు వాసుల నిలువుదోపిడీ
ఇక ఇది నిజమని నమ్మి జనాలు లక్షల్లో డబ్బులు గాడిదలను కొనడానికి పంపించారు. డాంకీ సెమినార్లు కూడా నిర్వహించి ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు కు చెందిన పలువురిని ట్రాప్ లో వేసుకున్నాడు. గాడిదల పాలు గంటకు మించి నిల్వ ఉండవని వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు కావాలని అదనంగా 75000 నుంచి లక్షన్నర వరకు మళ్ళీ కాజేశాడు.
ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల రూపాయల నుంచి కోటిన్నర వరకు వసూలు
సభ్యత్వం పేరుతో మరో ఐదు లక్షలు గాడిదల వైద్యం కోసం ఒక వెటర్నరీ డాక్టర్ను చూపించి అతనికి ఫీజుల పేరుతో మరో 50,000 సభ్యుల నుండి కాజేశాడు. ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల రూపాయల నుంచి కోటిన్నర వరకు వసూలు చేసిన కేటుగాడు ఆపై ప్లేట్ ఫిరాయించాడు. దీంతో లబోదిబోమనడం బాధితుల వంతు అయింది.
న్యాయం కావాలని బాధితుల డిమాండ్
ఇక ఉలగనాథన్ తోపాటు అతనికి సహకారాన్ని అందించిన గిరి సుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేష్ అనే వ్యక్తుల పైన పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వంద కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని అరెస్ట్ చెయ్యాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications