సచివాలయ ఉద్యోగాలకు నేడు నోటిఫికేషన్: 16వేల ఖాళీలు: ఏపీపీఎస్సీకి బాధ్యతలు..!
దాదాపు 16 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్..ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే ఆదేశాల కు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. అయితే, ఈ సారి మొత్తం బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ప్రవ్నా పత్రాల రూప కల్పనతో ాటుగా ముద్రణ వ్యవహారాలు సైతం ఏపీపీఎస్సీనే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ శాఖల..జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలతో తాజాగా నోటిఫికేషన్ జారీకి సంబంధించి తుది కసరత్తు సాగుతోంది. ఈ సాయంత్రం లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.
16 వేల ఉద్యోగాల భర్తీ దిశగా..
ప్రభుత్వ ఖాళీగా ఉన్న దాదాపు 16 వేల గ్రామ సచివాలయాల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 15న ప్రారంభించిన గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ప్రభుత్వం గతంలోనే పరీక్ష నిర్వహించింది. అయితే, అనేక కారణాలతో దాదాపు 16 వేల ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు.

తాజాగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీంతో..వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీని ద్వారా ఫిబ్రవరి నెలలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పంచాయితీరాజ్..రూరల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులు జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు..పోస్టులు వివరాలను ఏపీపీఎస్సీకి అందించారు.
ఏపీపీఎస్సీకి పూర్తి బాధ్యతలు..
ఈ సారి గ్రామ సచివాలయ ఉద్యోగాల నిర్వహణ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇవే పోస్టులకు సంబంధించి పరీక్షల సమయంలో అనేక ఆరోపణలు వినిపించా యి. ప్రశ్నపత్రం లీకయిందని..కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ ఆరోపణలు వినిపించాయి. అయితే, ఆ తరువాత ప్రభుత్వంతో పాటుగా ఏపీపీఎస్సీ సైతం ఆ వాదనను తోసి పుచ్చింది. అసలు పరీక్ష తాము నిర్వహించలేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ స్పష్టం చేసారు. ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు తమకు అప్పగించిన పరీక్షల నిర్వహణలో బీజీగా ఉండటంతో..ఈ సారి గ్రామ సచివాలయ పరీక్షల బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నా పత్రాల మొదలు..అన్ని బాధ్యతలు ఏపీపీఎస్సీ పర్యవేక్షించనుంది.