వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాస్ట్ ఇదేనా?: కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఫాస్ట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా లేదా మరో యంత్రాంగంఉందా? బీహార్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబంలోని విద్యార్థికి జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ వర్తింపచేయరా? జీవోలో 1956 నవంబర్‌ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లోని వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామంటే ఎలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ విధాన నిర్ణయం అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలని చెప్పింది.

ఫాస్ట్‌ పథకం అమలుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది.‘ఫాస్ట్‌' పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణజ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది.

కౌంటర్‌ దాఖలు చేయడానికి ఇప్పటికే మూడు పర్యాయాలు విచారణను వాయిదా వేశామని, గత నెలలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కౌంటర్‌ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఒక సీనియర్‌ న్యాయవాదిగా మిమ్మల్ని గౌరవిస్తూ చివరి అవకాశంగా రెండు వారాల గడువు ఇస్తున్నామని, కౌంటర్‌ దాఖలు చేయకుండా కోర్టులతో ఇలా వ్యవహరించడం సరికాదని అధికారులకు తెలియచెప్పాలని తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డిని సున్నితంగా మందలించింది.

High Court passes strictures against FAST

తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్‌) పేరిట తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 36ను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2014-15 విద్యాసంవత్సరానికి 1956, నవంబర్‌ 1 కంటే ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంటు చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసిందని, ఇది అన్యాయమని, రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14, 15, 19(డి),(ఇ), 21 కింద దేశపౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతోపాటు ఆర్టికల్‌ 371డి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 75, 95లకు వ్యతిరేకమని, దీనిని రద్దు చేయాలని కోరారు.

సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా వాదనలు ప్రారంభించిన ఏజీ - తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం పేరిట తెచ్చిన జీవో ఈ సంవత్సరానికి వర్తింప చేయడం లేదని, దీనిని అమలు చేయడానికి నియమ నిబంధనలు రూపొందించడానికి ఒక కమిటీ వేశామని, ఈ కమటీ అధ్యయనం చేస్తోందని కోర్టుకు తెలిపారు. బీహార్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబంలోని విద్యార్థి తెలంగాణలోని ఏ విద్యా సంస్థలోనైనా విద్యాభ్యాసం చేస్తే ఈ పథకం వర్తింస్తుందని భావించవచ్చా? అంటూ ఏజీని కోర్టు సూటిగా ప్రశ్నించింది.

నిబంధనలు రూపొందించిన తర్వాత ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే అప్పుడు హైకోర్టును ఆశ్రయించవచ్చని, ఈ వ్యాజ్యాల్లో పరిపక్వత లేదని, వీటిని కొట్టివేయాలని ఏజీ సమాధానమిచ్చారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ జోక్యం చేసుకుని - ప్రభుత్వం జారీచేసిన జీవోలోని నాలుగో పేరాలో 1956, నవంబర్‌ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లోని పిల్లలకే విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహాయం అందించాలని స్పష్టంగా నిర్దేశించారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఈ ఏడాదికి దీన్ని వర్తింపచేయడం లేదని తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి అన్నారు. ఏజీగా తన వాదనలు రికార్డు చేసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని, వీటికి పరిపక్వత లేదని మరోసారి కోరారు. మరి... 1956, నవంబర్‌ 1వ తేదీకి పూర్వమే తెలంగాణలో సెటిలయిన వారి పిల్లలకే ఆర్థిక సహాయం అందిస్తామని జీవోలో ఎందుకు పేర్కొనాల్సి వచ్చిందని, దీనిని ఏ విధంగా సమర్థించుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రత్యేక అంశంగా భావించి కౌంటర్‌ దాఖలుకు చివరిసారిగా మరో రెండు వారాల గడువు ఇస్తున్నామని ఏజీకి కోర్టు స్పష్టం చేసింది.

English summary
High Court made serious comments on Telangana government, while hearing petitions filed against FAST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X