Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అదే శాపమవుతోందా? ఢిల్లీ టూర్ తో మళ్లీ రిపీట్!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది ? ఎన్ని సీట్లు గెలవబోతోంది ? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ? గతంలో పోటీచేసిన సీట్లలోనే పోటీ చేస్తారా లేక కొత్త స్ధానాలు ఎంచుకుంటారా ?
జనసేన తరఫున పోటీ చేసేందుకు 175 స్ధానాల్లో అభ్యర్ధులు ఉన్నారా లేదా ? అంతెందుకు జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది ? లేదా మళ్లీ ఒంటరి పోరుకు సిద్దమవుతోందా ? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క దానికీ ఇప్పుడు జనసేన కార్యకర్తల దగ్గరే కాదు స్వయంగా అధినేత పవన్ వద్దా సమాధానం లేదు.

నాలుగు నెలల క్రితం పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. అనంతరం విజయవాడ వచ్చేసిన ఆయన.. చంద్రబాబును ఓ హోటల్లో కలిశారు. అనంతరం హైదరాబాద్ లో మరోసారి చంద్రబాబు ఇంటికెళ్లి భేటీ అయ్యారు.ఈ రెండు భేటీల తర్వాతా పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోకుండా చూస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రధాన విపక్షమైన టీడీపీతో కలిసి పోటీచేస్తామని పరోక్షంగా చెప్పారు. కానీ కొంతకాలంగా దీనిపైనా మౌనమే.
తాజాగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ జాతీయ నేతలు ఢిల్లీ పిలిపించారు. అక్కడ రెండు రోజుల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. మధ్యలో జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను వెళ్లి కలిశారు. రాజకీయ పర్యటన అయితే రాజకీయాల గురించి బీజేపీ నేతలతో మాట్లాడతారు.
రాష్ట్ర అంశాలపై కేంద్రమంత్రుల్ని కలవాలంటే ప్రత్యేకంగా వెళ్లి కలుస్తారు. కానీ పవన్ టూర్ రాజకీయమా లేక రాష్ట్ర అవసరాల కోసమా అనేది తేలలేదు. చివరికి ఢిల్లీ టూర్ ముగించుకున్న తర్వాత నిన్న రాత్రి ఏం జరిగిందని అడిగితే సమయం వచ్చినప్పుడు చెప్తామంటూ పవన్ దాటేశారు.
ఇలా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రతీ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ అదే గందరగోళ వైఖరిని కొనసాగిస్తున్నారు. పొత్తుల వ్యవహారంపైనా, అభివృద్ధ అంశాలపైనా, ఎన్నికల్లో పోటీపైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో వాటిపై దృష్టిపెట్టకుండా పవన్ అదే గందరగోళం కొనసాగిస్తున్నారు.
కాసేపు టీడీపీతో పొత్తు అనుకునేలా, మళ్లీ అంతలోనే బీజేపీతో పొత్తు కొనసాగుతుందనేలా వ్యవహరిస్తున్నారు. తన పోటీపై కానీ, జనసేన అభ్యర్ధుల పోటీపై కానీ మాట్లాడటం లేదు. దీంతో ఇదే గందరగోళంతో వెళ్లి గత ఎన్నికల తరహాలోనే పవన్ బోర్తా పడడం ఖాయమన్న ప్రచారం పెరుగుతోంది.












Click it and Unblock the Notifications