ముగ్గురి పోరులో 76 చోట్ల గెలిచిన వైసీపీ..! బయటపడుతున్న షాకింగ్ లెక్కలు..!
ఏపీలో తాజాగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలు (NDA) గెలిచాయి, కానీ ఆశించిన స్ధాయిలో ఫలితాలు మాత్రం సాధించలేకపోయాయి. మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకున్నా గత ఎన్నికల తర్వాత తొలిసారి విపక్ష వైసీపీకి (YSRCP) కోలుకునే అవకాశం ఇచ్చేశాయి. దీని వెనుక వైసీపీ పోరాటం కంటే కూటమిలోని మూడు పార్టీల కుమ్ములాటలే కీలక పాత్ర పోషించినట్లు తాజా గణాంకాలను బట్టి అర్దమవుతోంది. కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, కుమ్ములాటలు, క్రాస్ ఓటింగ్ ఇలా పలు కారణాలు వైసీపీ గెలిచిన స్ధానాల వెనుక ఉన్నాయని ఫలితాల గణాంకాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరిగితే ఇందులో కూటమి పార్టీలు ఏకగ్రీవాలతో సహా 499 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఇండిపెండెంట్లు ఆరు చోట్ల, సీపీఐ(ఎం) ఒక చోట జడ్పీటీసీ స్ధానాలు కైవసం చేసుకున్నాయి. మిగిలిన 76 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ 76 సీట్ల వైసీప విజయం కూటమి పార్టీలకు మింగుడు పడటం లేదు. దీంతో ఆయా చోట్ల వైసీపీ గెలిచి, కూటమి ఓటమి పాలవ్వడం వెనుక కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తేలింది కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు, క్రాస్ ఓటింగ్, ఏదో విధంగా కోటాలో సీటు తీసుకుని బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం వంటి కారణాలు ఉన్నాయి. వీటితో పాటు వైసీపీకి బలం ఉండి గెలిచిన స్ధానాలు కూడా ఇందులో ఉన్నాయి.

అయితే మెజార్టీ స్ధానాల్లో మాత్రం కూటమి పార్టీల మధ్య గ్యాప్ వల్లే వైసీపీకి కోల్పోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు వైసీపీ కొన్ని నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా జడ్పీటీసీ సీట్లు గెల్చుకుంది. ఇందులో కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, నంద్యాల, చంద్రగిరి, గంగాధరనెల్లూరు, రంపచోడవరం, పోలవరం, అరకు, పాడేరు, తంబళ్లపల్లె వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తంబళ్లపల్లెలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా చోట్ల టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఆయా చోట్ల కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు సరిగ్గా జరగకపోవడం, బలమైన అభ్యర్ధులను నిలబెట్టకపోవడంతో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ ఇంత పెద్ద సంఖ్యలో జడ్పీటీసీల్ని గెల్చుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.














Click it and Unblock the Notifications
