విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
అమరావతి రాజధాని పరిధిలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలోకి వచ్చే అర్బన్ నియోజకవర్గాలపై పూర్తిగా పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు తగినట్లుగానే అభ్యర్ధుల్ని కూడా ఎంచుకుంటోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో ఉన్న మాజీ ఎంపీ సుజనా చౌదరి పేరే ఇందుకు నిదర్శనం.
గతంలో రాజ్యసభ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి ఒకప్పుడు టీడీపీకి ఆర్ధిక మూలస్తంభాల్లో ఒకరు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలోకి ఆయన్ను చంద్రబాబే పంపారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికీ బీజేపీలో చంద్రబాబు మనిషిగానే సుజనా చౌదరికి పేరుంది. అలాంటి సుజనా చౌదరి ఈసారి విజయవాడ లోక్ సభ స్ధానంలో పోటీకి మొగ్గు చూపారు. అయితే ఆ అవకాశం సుజనాకు కాకుండా కేశినేని చిన్నికి ఇచ్చిన టీడీపీ.. ఆయన్ను గెలిపించే బాధ్యతను తిరిగి సుజనాకే అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు నుంచి అనూహ్యంగా సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో సుజనా చౌదరి పేరు ప్రకటనతో నియోజకవర్గంలో పరిణామాలు ఒక్కసారిగా మారనున్నాయి. దీనికి కారణం నిన్న మొన్నటి వరకూ ఈ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల ఓట్లను దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కాదని వైసీపీ మాజీ కార్పోరేటర్ షేక్ ఆసిఫ్ కు టికెట్ ఇచ్చింది. ఆయనకు పోటీగా ఎన్డీయే కూటమి తరఫున జనసేన నేత పోతిన మహేష్ లేదా టీడీపీ నుంచి జలీల్ ఖాన్ ఉంటారని ఆశించినా లాస్ట్ మినిట్ లో సుజనా ఎంట్రీ ఇచ్చారు.
విజయవాడ పశ్చిమ సీటులో సుజనా చౌదరి వంటి బిగ్ షాట్ పోటీలో ఉండటంతో ఇప్పుడు ఆర్ధికంగా అంత శక్తిమంతుడు కాని ఆసిఫ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే స్ధానికంగా ఉంటే టీడీపీ నేతలు, మద్దతుదారులంతా సుజనా చౌదరివైపు క్యూ కట్టడం ఖాయం. దీంతో నిన్న మొన్నటివరకూ ఆసిఫ్ గెలుపు అవకాశాలపై ఉన్న ధీమా కాస్తా సడలినట్లు కనిపిస్తోంది. సుజనాకు పోటీగా భారీగా ఆసిఫ్ డబ్బులు వెదజల్లడం కష్టం. అలాగని వైసీపీ అధిష్టానం కూడా ఆయనకు ఆర్దికంగా మద్దతిచ్చే పరిస్ధితి లేదు. దీంతో సుజనాకు గట్టి పోటీ ఇవ్వడం ఆసిఫ్ కు కష్టంగా మారనుంది. అదే సమయంలో ఈ సీటులో సుజనా సాధించే ఎంపీ ఓట్లు కేశినేని చిన్ని విజయానికి కీలకంగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications