భర్త వైసీపీలో ఎమ్మెల్సీ.. భార్య టీడీపీ తీర్ధం; శృంగవరపుకోటలో ఏం జరుగుతుందంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి, శృంగవరపుకోట వైస్ ఎంపీపీ ఇందుకురు సుధారాణి తెలుగుదేశం పార్టీలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం.
నిన్న వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి సుధారాణి తో పాటు ఒక 150 మంది నియోజకవర్గానికి చెందిన నాయకులు ప్రత్యేక వాహనాలలో విజయవాడకు వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరుడిగా పేరున్న రఘురాజు వైసీపీని వీడనున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది.

అందుకే ముందు సతీమణిని టిడిపి తీర్థం పుచ్చుకునేలా చేశారు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు కు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా ఎమ్మెల్సీ కూడా పార్టీ మారాలని భావిస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఆధిపత్య పోరులో భాగంగానే ఇందుకూరు రఘురాజు కూడా వైసిపి కి గుడ్ బై చెబుతారు అన్న చర్చ జరుగుతుంది.
ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన ఇందుకూరు రఘురాజు సతీమణి ఇందుకూరు సుధారాణి ఎస్.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అవినీతి, భూ ఆక్రమణలు ఎక్కువైపోయాయి అని, దీనిపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కమిషన్ లేకుండా ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదని, స్థానికసంస్థల సభ్యులకు గౌరవం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గౌరవం లేనిచోట ఉండలేకనే తాము టిడిపి తీర్థం పుచ్చుకున్నట్టు ఆమె చెప్పారు.

ఇక తాజా పరిణామాలతో శృంగవరపు కోటలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరికీ వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే ఎమ్మెల్సీ రఘురాజు తన భార్యను టిడిపిలోకి పంపినట్లుగా చర్చ జరుగుతుంది.
శృంగవరపుకోట ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మధ్య సయోధ్యకు కుదర్చడానికి సీఎం జగన్ ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో ఎమ్మెల్సీ పదవి ఉన్న కారణంగా రఘురాజు వైసీపీలో ఉండి, తన భార్యను తెలుగుదేశం పార్టీకి పంపారు అన్న చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికలలోపు ఇక్కడ ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.












Click it and Unblock the Notifications