యాభై రోజులు పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర
చిత్తూరు: వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జగన్ పాదయాత్ర కొనసాగుతున్నతరుణంలో ప్రజాసంకల్ప యాత్ర 50వ రోజుకు చేరుకోవడం విశేషం.
ఎపి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నసంగతి తెలిసిందే. సోమవారం
చిన్న తిప్పసముద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్ టిడిపిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

న్యూ ఇయర్...49 వ రోజు...
2018 జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభం రోజున జగన్ పాదయాత్ర 49 రోజుకు చేరుకుంది. చిన్నతిప్పసముద్రంలో ఉదయం శిబిరం వద్ద జగన్ న్యూ ఇయర్ సందర్భంగా వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో, ప్రజల ప్రతికష్టంలోనూ ఎల్లవేళలా తోడుగా నిలిచే శక్తిని ప్రసాదించమని దేవుణ్ని ప్రార్థించినట్లు జగన్ తన డైరీ లో పేర్కొన్నారు. 49వ రోజు జగన్ పాదయాత్ర మొత్తం 14.5 కిలోమీటర్ల సాగింది.

బహిరంగ సభ...తీవ్ర విమర్శలు...
ప్రజాసంకల్పయాత్ర 49 వ రోజు న్యూ ఇయర్ ప్రారంభం రోజున మదనపల్లి నియోజకవర్గంలోని చిన్నతిప్ప సముద్రంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగానే తరలివచ్చారు. ఈ సభలో ప్రసంగం సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న అంశాలను వేటినీ అమలు చేయడంలేదని, టీడీపీ వెబ్ సైట్ నుంచి అసలు మ్యానిఫేస్టోనే తొలగించారని, తమ తప్పులు తెలిసిపోతాయనే అలా చేశారని జగన్ ఆరోపించారు.

జగన్ పాదయాత్ర@50
జగన్ తన 50వ రోజు పాదయాత్రను ఉదయం మదనపల్లి మండలం సీటీఎం నుంచి ప్రారంభించారు. వేరుశెనగ రైతులు జగన్ ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని, సహకార నూనె కర్మాగారాన్ని మూసివేయించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వారికి వైఎస్ జగన్ వారికి హామీయిచ్చారు. జగన్ 50 వ రోజు పాదయాత్ర పులవాండ్లపల్లి, వాల్మీకిపురం, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిలవారిపల్లె వరకు కొనసాగనున్నట్లు తెలిసింది.

ఇప్పటివరకు...ఇకముందు...
2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు 2018 జనవరి 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే ఆయన దాదాపు 650 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు....ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ మొత్తం 13 జిల్లాల్లో 180 రోజులు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని.. ఈ క్రమంలో సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకోవాలని జగన్ పాదయాత్ర ప్రణాళిక.












Click it and Unblock the Notifications