బాబులానే జగన్ పాలన .. ఏపీ ప్రజలు జగన్ ను కూడా ఇంటికి పంపుతారన్న బీజేపీ నేత
ఏపీలో బీజేపీ వైసీపీపై, వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చెయ్యాలని తెగ ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. పార్టీలోకి బలమైన నేతలను ఆహ్వానించటం తో పాటి బీజేపీ కి బలమైన క్యాడర్ ఉండాలని భావిస్తుంది. అందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జాతీయ నాయకులను ఆహ్వానిస్తూ వారి ద్వారా జనాలను ఆకర్షించే పనిలో ఉంది.

చంద్రబాబు పరిస్థితే జగన్ కు వస్తుందన్న బీజేపీ నేత
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు చేశారు . గుంటూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన చౌహాన్ జగన్‌తో పాటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు పరిస్థితే జగన్‌కు తప్పదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కూడా చంద్రబాబు తరహా పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కుల రాజకీయాలు చేస్తే ప్రజలు ఇంటికి పంపుతారంటూ జగన్ పై విమర్శలు
బాబులానే జగన్ కూడా ఒక కులానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్న ఆయన కుల రాజకీయాలు చేస్తే ఆయన్ను కూడా ప్రజలు ఇంటికి సాగనంపుతారన్నారు. చంద్రబాబు మోదీని, బీజేపీని టార్గెట్ చేశారని.. తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని అందుకే ఆయనకు ఎన్నికల్లో ఓటమి తప్పలేదని ఎద్దేవా చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేసిన ఆయన ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని దక్కించుకుంటామని తేల్చి చెప్పారు.

వైసీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ.. సీఎం పాలనపై తీవ్ర విమర్శలు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన జన సంఘ్ కార్యకర్తల కాళ్ళు కడిగారు. బీజేపీకి విలువలు ముఖ్యమని చెప్పిన ఆయన జగన్ తీరు మారకుంటే జనాలు ఇంటికి పంపించటం ఖాయం అన్నారు . తమ పార్టీ అధికారం కోసం కాదు.. ప్రజాసేవ కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒక సాధారణ పార్టీ కార్యకర్తను దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు వైసీపీ టార్గెట్ గా పెద్దగా బీజేపీ నేతలు మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే బీజేపీ సైతం వైసీపీ పాలనపై , సీఎం జగన్ తీరుపై విమర్శలు చేస్తుంది. మొన్నటికి మొన్న బీజేపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులను ఖండించింది బీజేపీ. ఇక ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications