పిఠాపురంలో జనసేనకు రిగ్గింగ్ షాక్-రీపోలింగ్ డిమాండ్-రచ్చ రచ్చ..!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్ లలోకి అనుమతించకుండా రిగ్గింగ్ చేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సైతం ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తాయి. దీనికి కారణం జనసేన పోలింగ్ ఏజెంట్లను సైతం పోలింగ్ బూత్ లలోకి అనుమతించకపోవడమే.
పిఠాపురంలో అధికార జనసేన పార్టీ (JanaSena) మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్ధుల్ని నిలబెట్టింది. వీరిలో ఇద్దరు నిలబడిన చోట పోలింగ్ బూత్ లలో ఇవాళ సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ అయిన జనసేన ఏజెంట్లను సైతం పోలింగ్ బూత్ లలోకి అనుమతించకుండా స్వయంగా పోలీసులు ఆటంకాలు కల్పించారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీతో పాటు స్వతంత్ర అభ్యర్ధికి చెందిన పోలింగ్ ఏజెంట్లను మాత్రం బూత్ లలోకి అనుమతించారు. ఇలా పిఠాపురంలో 18, 19 వార్డుల్లో జరిగింది. దీంతో జనసేన నేతలు భగ్గుమన్నారు.

పిఠాపురంలో పోలింగ్ బూత్ వద్ద జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పిఠాపురం 18, 19 వార్డుల్లో స్వతంత్ర, వైసీపీ అభ్యర్థుల ఏజెంట్లను మాత్రమే బూత్‌లలో ఉంచి మిగిలినవారిని బయటకు పంపారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దీంతో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు బూత్ వద్ద ఆందోళనకు దిగారు. తమను లోపలికి పంపాలని కోరారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలోని ఈ రెండు బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని, కాబట్టి పోలింగ్ రద్దు చేసి, తప్పనిసరిగా రీపోలింగ్ నిర్వహించాలని జనసేన నేతలు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
