వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుల తడక: బిల్లుపై కేంద్రంపై ధ్వజమెత్తిన కిరణ్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో శనివారం చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బిల్లులో తప్పులున్నాయని ఆయన అన్నారు. లోపాలున్నాయని, బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు.

తన ప్రసంగం తర్వాత అన్ని లెక్కలకు సమాధానం చెబుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయిందని, ఒక్కో మెగావాట్‌కు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అందుకని తెలంగాణలోని ప్రాజెక్టును చేపట్టలేకపోయామని ఆయన అన్నారు. గ్యాస్ కేటాయింపులు జరపాలని తాను చాలా ఘాటుగా కూడా కేంద్రానికి లేఖ రాశానని ఆయన అన్నారు. శంకర్‌పల్లి, కరీంనగర్ గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులు చేపట్టకపోవడంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా ఆయన ఆ విషయం చెప్పారు.

శంకరపల్లి,కరీంనగర్ ప్రాజెక్టులను చేపట్టకపోవడంలో దురద్దేశం లేదని, గ్యాస్, లింకేజీలు లేకపోవడం వల్లనే చేపట్టలేకపోయామని ఆయన అన్నారు. గ్యాస్ తగ్గిపోయిందని ప్రధాని కూడా చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణలో 138 శాతం వ్యవసాయ సాగు పెరిగిందని ఆయన చెప్పారు. వరిసాగు తెలంగాణలో 842 శాతం, రాయలసీమలో 142 శాతం, ఆంద్రలో 2.12 శాతం పెరిగిందని చెబుతూ తెలంగాణ అభివృద్ధి చెందలేదని చెప్పగలరా అని ఆయన అడిగారు.

Kiran Kumar Reddy

తెలంగాణ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక శాతం గణనీయంగా పెరిగిందని, లక్షా 90 వేల మంది ఉపాధ్యాయులు తెలగాణలో ఉున్నారని ఆయన అన్నారు. విద్య, వ్యవసాయ రంగాల్లో ఆంధ్ర, రాయలసీమల కన్నా తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. పాఠశాలల విషయానికి వస్తే ఆంధ్రలో 101 శాతం రాయలసీమలో 155 శాతం తెలంగాణలో 467 శాతం పెరిగాయని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని, ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

అభివృద్ధి చెందితే సీమాంధ్ర ముఖ్యమంత్రులకు సంబంధం లేదని, జరగకపోతే సీమాంద్ర ముఖ్యమంత్రులకు సంబంధమని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో అనుబందాన్ని తెంచకూడదని తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఫార్మా, ఐటి, ఆస్పత్రులు, తదితర రంగాలన్నీ హైదరాబాదులో అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు.

హైదరాబాదుతో తనకు అనుబంధం ఉందని, ఈ వీధుల్లో తిరిగినవాడినని, ఇక్కడి స్నేహతులు ఎక్కువ మంది తనకు ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో తనతో సంబంధాలున్నవారు ఐదారుగురు ఉన్నారని, వారంతా తనతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. తాను క్రికెట్ హైదరాబాద్‌కే ఆడానని ఆయన అన్నారు. అండర్ 25, అండర్ 22 క్రికెట్ జట్టుకు తాను కెప్టెన్‌ను అని ఆయన అన్నారు. ఆంధ్ర క్రికెట్‌కు ఆడబోనని ఆనాడు చెప్పానని ఆయన అన్నారు. తన జట్టులో ఆడినవారు కనీసం 25 మంది జాతీయ జట్టులో ఆడారని ఆయన చెప్పారు. ప్రతి మాటా హృదయం నుంచి మాట్లాడుతున్నానని, తెలంగాణ రాకూడదని మాట్లాడడం లేదని, తెలంగాణ వస్తే తనకు నష్టం ఏమీ లేదని, తెలంగాణవాళ్లకే ఎక్కువ నష్టమని మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.

ఇక్కడ పుట్టిపెరిగాను, ఇక్కడ నష్టం జరగకూడదనే మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. యాభై, అరవై సంవత్సరాల నుంచి వచ్చి స్థిరపడి ఉన్నారని ఆయన అన్నారు. ఉద్వేగపూరతమైన సంబంధం పోతుందనే భావనతోనే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన తనకు దీంతో సంబంధం లేదంటే బాధ కలుగుతుందని సోనియాతో చెప్పానని ఆయన అన్నారు. తమ పార్టీ అధిష్టానంతో చెప్పిందే ఇక్కడ చెబుతున్నానని ఆయన అన్నారు. కలిసి ఉంటే లాబాలేమిటో ఇక్కడి కన్నా తమ అధిష్టానానికి ఎక్కువగా చెప్పానని ఆయన అన్నారు.

ఆలంపూర్‌ దేవాలయానికి కర్నూలు నుంచి పూలు పంపిస్తారని, పూలు అమ్ముకునేవారు కూడా విభజన జరుగుతుందని బాధపడుతున్నారని ఆయన అన్నారు. రాయవెల్లూరు వెళ్తే ఉచితంగా వైద్యం చేయడం లేదని ఆయన అన్నారు. ఇబ్బందులు వస్తాయని మాత్రమే విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రసంగానికి తెరాస సభ్యులు అభ్యంతరం చెప్పారు. నిజాలు చెప్తే ఉలిక్కి పడకూదడని ఆయన అన్నారు. హైదరాబాదులోనే ఆస్పత్రులన్నీ ఉన్నాయని, విభజన జరిగితే వైద్య సౌకర్యాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు. మీరు నేనూ శాశ్వతం కాదని, తాను రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిని అని ఆయన అన్నారు. వ్యక్తులు మారినప్పుడు విధానాలు మారుతాయని ఆయన అన్నారు. విభజన జరిగితే ఇబ్బందులున్నాయనే మీ దృష్టికి తెస్తున్నానని ఆయన అన్నారు.

పివి నరసింహారావు ప్రధాని, సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారంటే గర్వ పడుతున్నామని ఆయన అన్నారు. 42 సీట్లు ఉంటేనే ఢిల్లీలో బలం ఉంటుందని, అది తగ్గితే బలం తగ్గుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ హమారా హై, సబ్ ఊంచే రహెనా హై అని ఆయన అన్నారు. దానం నాగేందర్‌తో తనకు చాలా చిన్నప్పటి నుంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదు గురించి ఎవరూ మాట్లాడడం లేదని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఆయన ఆవిధంగా ఉన్నారు. చదువుకు కూడా హైదరాబాదు కోంద్రమని ఆయన అన్నారు. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కు అవకాశం కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌పై ఎంత ఖర్చు పెడుతున్నా ఎందుకు ఖర్చు పెడుతున్నారని ఎవరూ అడగలేదని, అందరిదీ అనే ఉద్దేశంతోనే ఎవరూ ఆ ప్రశ్న వేయలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పరిశ్రమలు వచ్చాయని, హైదరాబాదుకు దగ్గర కావడం వల్లనే అని ఆయన అన్నారు. కలిసుంటేనే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయనే ఆశ, నమ్మకం తనకు ఉన్నాయని ఆయన అన్నారు.

అన్నింటికన్నా ముఖ్యమంది శాంతిభద్రలని, హైదరాబాదు గురించీ ఆంద్రప్రదేశ్ గురించీ తెలిసినవారు బిల్లు తయారు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణలో, హైదరాబాదులో హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. వాస్తవాల నుంచి దూరం పోతామంటే కుదరదని ఆయన అన్నారు. 35 ఏళ్లలో మతఘర్షణల్లో రాష్ట్రంలో 400 మంది చనిపోయారని ఆయన చెప్పారు. చిన్న సమస్య వస్తే ఇతర ప్రాంతాలకు కూడా పాకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

25 వేల మంది పోలీసులను సీమాంద్రకు చెందిన 13 జిల్లాల నుంచి తీసుకుని వచ్చి ఉత్సవాలు జరిగినప్పుడు పెడతామని, ఇతర తెలంగాణ తెలంగాణ జిల్లాల నుంచి తీసుకువస్తే అక్కడ సమస్యలు తలెత్తితే ప్రమాదమని అలా చేస్తున్నామని ఆయన అన్నారు. రెండు మాసాల కోసం ల్కషకు పైగా పోలీసులను నియమించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. మనం శాశ్వతం కాదని, మనం ఓ రైల్లో సహ ప్రయాణికులమని, అందుకే మాట్లాడాల్సి వస్తుందని తెరాస సభ్యుల అభ్యంతరాలను ఉద్దేశించి అన్నారు.

నక్సలైట్లు అతి పెద్ద ప్రమాకరమని ప్రధాని గతంలో అన్నారని ఆయన చెప్పారు. ఈ వైరస్‌ను తొలగించకపోతే ప్రమాదమని ప్రధాని చెప్పినట్లు ఆయన అన్నారు. అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిందని కూడా అభిప్రాయపడినట్లు తెలిపారు. తెలంగాణ నాయకులు ఎక్కువ మంది నక్సలైట్ ఉద్యమంలో ఉన్నారని ఆయన అన్నారు. గట్టిగా పోలీసు బలగాలున్నాయి కాబట్టి సరిగా ఎదుర్కుంటున్నామని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలకు కూడా ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలై పోలీసు బలం తగ్గినప్పుడు నక్సలైట్లు విజృంభిస్తారని, దీని గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.

అందరం కలిసికట్టుగా దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచన చేసుకోవాలని ఇదంతా చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రణాళికా బడ్జెట్ విషయంలో మన రాష్ట్రం రెండో అతి పెద్దదని, ఇది రెవెన్యూ ఆదాయాన్ని బట్టి ఉంటుందని ఆయన చెప్పారు. పెద్ద రాష్ట్రం కాబట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగామని ఆయన అన్నారు. కొత్త సంక్షేమ పథకాలు తీసుకుని రాగలిగామని, నిధులు ఉంటేనే ఏదైనా చేయగలమని ఆయన అన్నారు. 28 వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్తు, బియ్యం పంపిణీ, ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీ, హౌసింగ్, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణఆల వంటి సంక్షేమ పథకాలను కలిసి ఉండడం వల్లనే చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు.

రెండు వేల కోట్లు అదనంగా రెండు రాష్ట్రాలు అయితే ఖర్చవుతుందని ఆయన అన్నారు. పింఛన్లు పెరుగుతాయని ఆయన అన్నారు. ఇవన్నీ పెరిగితే సంక్షేమ పథకాలు చేయలేమని ఆయన అన్నారు.

న్యాయవ్యవస్థలో నియామకాలు వారే చేసుకుంటారని, ముఖ్యమంత్రులకు సంబంధం లేదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో నియామకాల విషయాన్ని ముఖ్యమంత్రులకు అంటగట్టవద్దని ఆయన అన్నారు. ఉన్నవీ లేనివీ అన్నీ చెప్పి తెలంగాణ అంటే ప్రేమలేదు, చెడ్డవాళ్లం అని చెప్పవద్దని ఆయన కోరారు. తాను ముఖ్యమంత్రి అవుతూనే హైదరాబాదీ అని చెప్పానని, అది తన తొలి ప్రకటన అని ఆయన అన్నారు. తాను తిరిగినన్ని గల్లీలు మీ తెలంగాణవాళ్లు తిరిగి ఉండరని ఆయన అన్నారు. హైదరాబాద్ తనకు బాగా తెలుసునని, కరీంనగర్, నిజామాబాద్ కూడా తెలుసునని, తనకు తెలంగాణతో విశేషమైన సంబంధాలున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణలో ఏ అంశాల గురించి బాధపడుతున్నారని, ఆ బాధను తొలగించాలనే ప్రయత్నం చేశానని, తెలంగాణకు చెందిన వ్యక్తిని అడ్వొకేట్ జనరల్‌గా చేశానని ఆయన అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తెలంగాణకు చెందినవారేనని ఆయన అన్నారు. ఎందుకు తెలంగాణవాడిని పెట్టారని రాయలసీమ, ఆంద్రవాళ్లు అడగరని, తాము ఆ దృష్టితో చూడలేదని, చూడబోమని ఆయన అన్నారు. తన వల్ల బాధ కలిగే విధంగా తాను వ్యవహరించలేదని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు ప్రజల్లో ఎంత ఇబ్బంది ఉన్నా తనకు సహకారం అందించారని, ఆ విషయాన్ని తాను సోనియాతో కూడా చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు అవిశ్వాసం తీర్మానం విషయంలో ప్రభుత్వాన్ని ఓడించడానికి చేసిన ప్రయత్నాలకు లొంగలేదని ఆయన అన్నారు. తెలంగాణవాళ్ల బాధను తగ్గించడానికే తాను పనిచేశానని ఆయన చెప్పారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు గురించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడానని, తొమ్మిది క్లియరెన్స్‌లు తెప్పించానని, ఇంకా కొన్ని రావాల్సి ఉందని, విద్యుత్తుకు ఖర్చవుతుందని అన్నారని, కానీ సరిగా వాడుకుంటే పొదుపు చేసే అవకాశం ఉందని, ఖర్చు ఎక్కువైనా లాభసాటి ప్రాజెక్టు చేయాలని తాను ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నలుగురు చేశారని, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులుగా ఉంటే ఎవరు తీసేశారని, సీమాంద్రకు చెందిన ముఖ్యమంత్రులను ఎవరు తొలగించారని, తమ పార్టీ అధిష్టానం చేతుల్లో మాత్రమే ఎవరు ముఖ్యమంత్రులుగా ఉండాలనే విషయం ఉంటుందని ఆయన అన్నారు. అప్పటి పరిస్థితిలో ముఖ్యమంత్రుల మార్పు జరిగింది తప్ప సీమాంద్రులకు సంబంధం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణకు ఓ ప్యాకేజీ తయారు చేసి ఇచ్చానని ఆయన చెప్పారు.

రాష్ట్రాన్ని విభజించినప్పుడు వచ్చే ఇబ్బందులు తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఉండదని, అన్ని రంగాల్లో ఇతర ప్రాంతాలకు ఇబ్బంది ఉండదని ప్యాకేజీ ప్రతిపాదన చేశానని ఆయన చెప్పారు. ప్యాకేజీ ఇస్తామంటే వెనకబడి ఉందని ఒప్పుకున్నట్లు కాదని, ఆ భావనను తొలగించాలనే ఉద్దేశంతోనే ఆ పథకం ప్రతిపాదన చేశానని ఆయన చెప్పారు.

ప్రజల్లో ఏకాభిప్రాయం తీసుకు రావాల్సిన అవసరం ఉందని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకుల్లో ఏకాభిప్రాయం ఉన్నా ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. విభజన బిల్లును ఏకపక్షంగా తయారు చేశారని తాను ప్రధానికి, రాష్ట్రపతికి చెప్పినట్లు ఆయన తెలిపారు.

మనకు వచ్చింది ముసాయిదా బిల్లు కాదని ఆయన అన్నారు. కారాణాలు, ఆర్థికపరమైన అంశాలు, అన్ని రకాల అంశాలు ఉండాలని శాసనసభ నిబందనలు తెలుపుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రపతి మనకు చెప్పింది మనకు బిల్లు అన్నారని, హోం శాఖ కార్యదర్శి కూడా బిల్లు అన్నారని, మనమేమో ముసాయిదా బిల్లు అంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం అతిక్రమించకూడదని జస్టీస్ జీవన్ రెడ్డి బొమ్మై, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో అభిప్రపాయపడినట్లు ఆయన తెలిపారు.

లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ఏమిటి, కేంద్రం ఏం ఆలోచన చేస్తోంది, కారణాలు ఏమిటి, ఏ ప్రయోజనాలు ఆశించి, రెండు ప్రాంతాలకు ఏ ప్రయోజనాలు జరుగుతాయి అనే విషయాలు బిల్లులో లేవని ఆయన అన్నారు. వారి అభిప్రాయాలు తెలియజేయకుండా మన అభిప్రాయాలు దేనిపై చెప్పాలని ఆయన అడిగారు. ఆర్థిక పత్రం జత చేయలేదని ఆయన చెప్పారు. ఏమీ లేకుండా చేస్తాం, చూస్తాం, పరిశీలిస్తామంటే సరిపోదని ఆయన అన్నారు. బిల్లును సరైన పద్ధతిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి నుంచి వచ్చినా రాజ్యాంగం ప్రకారమే జరగాల్సి ఉంటుందని, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆయన అన్నారు. అడిగిన సమాచారం ఇవ్వడానికి నిరాకరించారని, ఇది బిల్లో ముసాయిదా బిల్లో తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

ఒరిజినల్ బిల్లు వస్తే సూచనలు వస్తే పార్లమెంటు తన ఇష్టప్రకారం చేయవచ్చు గానీ పంపించాల్సింది ఒరిజినల్ బిల్లు అని, మనకు వచ్చింది ఒరిజినల్ బిల్లు కాదని, డ్రాఫ్ట్ బిల్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని అంటే హక్కులే లేకుండా చేస్తారా అని ఆయన అడిగారు. ఇది రాజ్యాంగంలో లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలో లేని విషయాలు తెచ్చి రాజ్యాంగ సవరణలు చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. 371డి రెండు రాష్ట్రాల్లో ఉంటుందని, దానివల్ల రాజ్యాంగ సవరణ అవసరం లేదని అంటున్నారని ఆయన అన్నారు. కొత్తగా ఉద్యోగాలు తెలంగాణవారికి రావని, ఉన్న ఉద్యోగాలే వస్తాయని ఆయన అన్నారు. దీన్ని తెలంగాణ యువకులు అంగీకరిస్తారా అని అడిగారు. గవర్నర్‌కు హైదరాబాద్‌పై అధికారాలు ఇవ్వడాన్ని తాము అంగీకరించబోమని ఆయన అన్నారు.

ఉమ్మడి రాజధాని, 371డి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీలు లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల బదిలీల్లో ఇబ్బందులున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా విభజన మంచిది కాదని, విశాలమైన హృదయంతో, దృష్టితో దేశంలోనే వెనకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలను అమలు చేయాలని, తెలంగాణలో ఉత్పన్నమైన సమస్య ఈ రాష్ట్రానికి పరిమితమైంది కాదని, ఈ విషయాలను పివి నరసింహారావు చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించకూడదని, సమైక్యవాది కన్నా తాను ఎక్కువగా కాంగ్రెసువాదినని, విభజనను వ్యతిరేకించడంలో తనకు స్వార్థం లేదని ఆయన అన్నారు. జై ఆంద్ర ఉద్యమంలో కూడా తన తండ్రి దాన్ని బలపరచలేదని, సమైక్యంగా ఉండాలనే తాము కోరుకున్నామని ఆయన అన్నారు.

విభజన చేస్తామని చెప్పినప్పుడు తాను మౌనంగా లేనని, ఇందులో తాను బాగం కాబోనని చెప్పానని, తన తండ్రి చనిపోయినప్పుడు బాధపడినదాన్నికన్నా ఎక్కువ బాధపడుతున్నానని చెప్పానని ఆయన అన్నారు. కొట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పానని ఆయన అన్నారు. తనకు ఏ విధమైన దురుద్దేశం లేదని, తన ఆవేదన మాత్రమే వ్యక్తం చేస్తున్నానని, ఎవరినో బాధపెట్టడానికో, ఎవరికో రాష్ట్రం వస్తుంటే అడ్డుపడాలనో తాను అనుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనం కోసమే తాను ఈ విధానాన్ని తీసుకున్నానని, విభజనను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పారు.

English summary
CM Kiran kumar Reddy continued his speech in assembly on Telangana draft bill today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X