LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..!
ఇరాన్ వార్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా ఎల్పీజీ (LPG) కొరత ఏర్పడుతోంది. దీంతో హోటళ్ల యజమానులు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (ap govt)ఇవాళ ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు. అలాగే గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. కీలకమైన ఈ సమయంలో ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా జిల్లాలవారీగా చర్యలు తీసుకోవాలనీ, ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.

అవసరం అయితే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్ ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తామని మనోహర్ వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించి హెచ్పీసీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్ చర్లపల్లి పైపులైను, విశాఖలోని హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీల ద్వారా రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళ్తామన్నారు. ప్రజలు ఇబ్బందులుపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications