వైఎస్ జమానాలోనే ఎదిగిన మల్లాది విష్ణు: కాంగ్రెస్‌కు చిక్కులే?
విజయవాడ: కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించిన ఘటనకు సంబంధించిన కేసులో కాంగ్రెసు పార్టీ నాయకుడు మల్లాది విష్ణు ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో ఆయన విజయవాడ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే మాట వినిపిస్తోంది. రాజీనామా చేయాలని ఆయనకు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు కూడా స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మల్లాది విష్ణు జాతకం మారినట్లు చెబుతున్నారు. ఆయనను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉడా చైర్మన్‌గా చేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. దాంతో విజయవాడ తూర్పు టికెట్ మల్లాది విష్ణుకు దక్కింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు రెండవ సారి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మల్లాది విష్ణు కూడా విజయం సాధించారు.

అప్పటి నుంచి మల్లాది విష్ణు విజయవాడ నగర కాంగ్రెసులో కీలకమైన నేతగా ఎదిగారు. 2014 ఎన్నికలకు ముందు మల్లాది విష్ణు కాంగ్రెసుకు రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి మారుతారనే ప్రచారం సాగింది. అయితే, ఆయన కాంగ్రెసులోనే ఉండిపోయారు. అయితే, 2014 ఎన్నికల్లో రెండవసారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో విజయవాడ నగరంలోనూ, కృష్ణా జిల్లాలోనూ చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో నగర బాధ్యతలను కాంగ్రెసు పార్టీ నాయకత్వం మల్లాది విష్ణుకు అప్పగించింది. దీంతో గత ఏడాదిన్నర కాలంగా విష్ణు నగరంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
విష్ణు నాయకత్వంలో పార్టీ విజయవాడ నగరంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మల్లాది విష్ణు కల్తీ మద్యం కేసులో చిక్కుకోవడంతో కాంగ్రెసు పార్టీకి విజయవాడ నగరంలో ఎదురు దెబ్బ తగిలినట్లే.