చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు!
కృష్ణా జిల్లా, చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. ఈ రోజు ఉదయం చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెను ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణసంచా, మందుగుండు సామాగ్రిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించింది.
చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు
చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ పేలుడులో సబ్ ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.గతంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిని ఈరోజు ఉదయం 10గంటల సమయంలో అవనిగడ్డ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎస్సై డి. ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కోర్ట్ కానిస్టేబుల్ అబ్దుల్లా మరియు డ్రైవర్ నాగరాజు కలిసి సామాగ్రిని వాహనంలోకి చేరుస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది.

పోలీస్ వాహనం దగ్ధం
ఈ దుర్ఘటనలో పోలీస్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎస్ఐ తో పాటు వాహన డ్రైవర్ ఇద్దరు కానిస్టేబుల్స్ తీవ్రగాయాల పాలు కాగా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన తర్వాత హుటాహుటిన అక్కడకు చేరుకున్న సీఐ ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి బాణాసంచా రాపిడి జరగడం కారణమా లేక మరి ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా అన్న దానిపైన ఆ దిశలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
పేలుడుకు ధ్వంసం అయిన ఫర్నీచర్, కిటికీలు
అకస్మాత్తుగా సంభవించిన ఈ పేలుడు ఘటనలో ఎస్సై దుర్గా ఆంజనేయులు, కాలికి గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజును మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక కీర్తి ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పోలీస్ వాహనం మాత్రమే కాకుండా, స్టేషన్లోని ఫర్నిచర్ మరియు కిటికీలు ధ్వంసమయ్యాయి.
భయాందోళనలో స్థానికులు
పేలుడు శబ్దం భారీగా రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications