నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్య!!
నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో విషాద సంఘటన జరిగింది. నారాయణ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న 24 సంవత్సరాల చైతన్య అనే వైద్య విద్యార్థిని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య నెల్లూరులోని మెడికల్ కళాశాల హాస్టల్లో ఉంటూ హౌస్ సర్జన్ గా పని చేస్తుంది. కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చైతన్య విగతజీవిగా కనిపించింది. ఒంటిగంటకు రోహిణి హాస్టల్ రూమ్ నెంబర్ ఫోర్ లో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బందికి విద్యార్థులు సమాచారం అందించగా వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

హాస్టల్ కు చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెడికల్ విద్యార్థిని చైతన్యకు గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. చైతన్య వివాహం తర్వాత వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని , కుటుంబ కలహాలు పెద్దవి అయ్యాయని భర్తతో తాను వేగలేక పోతున్నానని చైతన్య తరచు తల్లితో చెప్పేదని తెలిసింది.
కుటుంబ కలహాల కారణంగా చైతన్య ఆత్మహత్య చేసుకుందని, చైతన్య ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమని చైతన్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .గత రాత్రి తన తల్లి, భర్తతో ఆమె చివరి ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా సమాచారం. భర్తతో మాట్లాడిన తర్వాత తల్లి కి కాల్ చేసి హాస్టల్ గదిలో కి వెళ్లి చైతన్య సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు చైతన్యకు భర్తకు మధ్య గొడవ వల్లే చైతన్య చనిపోయిందా? లేదా కాలేజీలో ఏమైనా వేధింపులు ఉన్నాయా? ఆమె మాట్లాడిన చివరి ఫోన్ కాల్స్ లో ఏం మాట్లాడింది? అంత తీవ్రమైన నిర్ణయానికి కారణం ఏమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications