కనీసం పులిహోర ప్యాకెట్లయినా ఇచ్చావా జగన్.. ఇచ్చిపడేసిన లోకేష్!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మంత్రి నారా లోకేష్ టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇంటిని రక్షించుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తారు అని జగన్ ఆరోపించడంతో పాటు వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అని జగన్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు.
జగన్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్
చంద్రబాబు అహర్నిశలు వరద ముంపు బాధితుల కోసం పని చేస్తుంటే ఆయనపై విమర్శలు చేయటానికి నీకు మనసెలా వచ్చిందని లోకేష్ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? అంటూ ప్రశ్నించిన లోకేష్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

నీకు మనసెలా వచ్చింది జగన్
పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగుళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతున్నారని విమర్శించారు. 74 ఏళ్ల వయస్సు లో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబు గారి పై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చింది జగన్ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
విపత్తుకు ప్రధాన కారణం మీరే
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదని ఎద్దేవా చేశారు.
పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే! నాడు చంద్రబాబు గారు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారని లోకేష్ ఆరోపించారు.
రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా
బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేశారని, సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదన్నారు. 5 ఏళ్ళలో సరైన నిర్వహణ లేదని విమర్శించారు.
మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు
విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని మండిపడ్డారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు అని లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు . అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం అని తమ పాలనలో ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు లోకేష్.












Click it and Unblock the Notifications