ఏపీలో నూతన టెక్స్ టైల్ పాలసీ.. మహిళలకూ చంద్రబాబు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి పారిశ్రామిక ప్రగతికి, పెట్టుబడుల సాధనకు, ఇదే సమయంలో ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం వరుసగా పారిశ్రామిక ప్రగతికి నూతన పాలసీలను తీసుకు వస్తుంది. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేస్తుంది.
ఏపీలో నూతన టెక్స్ టైల్ పాలసీ
పారిశ్రామిక ప్రగతి ద్వారా సంపద సృష్టించటం పైన దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కి పైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది . దీనిలో భాగంగా నూతన టెక్స్ టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు.

రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఏపీ సర్కార్ ప్లాన్
రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్ టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని, దీని ద్వారా మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
మహిళలకు ఉపాధి ఇచ్చే యోచనలో చంద్రబాబు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై కూడా ప్రతిపాదించారు. కొత్త పాలసీలో భాగంగా కేపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సిఎం అన్నారు.
వస్త్ర తయారీలో పెట్టుబడులకు ఉత్తమమైన వేదిక
వస్త్ర తయారీలో పెట్టుబడులకు కొత్త పాలసీ ద్వారా రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పాలసీ డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం దీనికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకువచ్చి ఏపీలో అమలు దిశగా అడుగులు వెయ్యాలని భావిస్తున్నారు. టెక్స్ టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైనా సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు మరింత కసరత్తు తరువాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications