AP Nominations: నేడు తేలిపోనున్న నామినేషన్ల లెక్క-రెబెల్స్ పై టెన్షన్..!
ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లపై ఇవాళ స్పష్టత రాబోతోంది. ఇప్పటికే అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. అనంతరం ఆమోదం పొందిన, తిరస్కరించిన నామినేషన్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ఉంచారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇవాళ్టితో ఈ గడువు కూడా ముగియనుంది. దీంతో సాయంత్రానికి నామినేషన్ల లెక్క తేలిపోనుంది.
ఏపీ ఎన్నికల్లో ఇప్పటివరకూ 25 లోక్ సభ సీట్లకు 1103 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 771 నామినేషన్లను ఆమోదించారు. అలాగే 291 నామినేషన్లను తిరస్కరించారు. అయితే ఒక్క నామినేషన్ కూడా అభ్యర్ధులు ఉపసంహరించుకోకపోవడం విశేషం. మరోవైపు 175 అసెంబ్లీ స్ధానాలకు 6001 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 4189 నామినేషన్లు ఆమోదించారు. మరో 1645 నామినేషన్లను తిరస్కరించారు. 9 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్దానాలకు నామినేషన్ల ఉపసంహరణకు ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ అభ్యర్ధులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్ధుల నామినేషన్ల లెక్క తేలిపోతుంది. సాయంత్రం బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధులకు పోటీ చేసే గుర్తుల్ని కేటాయిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులు గుర్తుల కేటాయింపు చేపడతారు.
ఇదంతా ఓ ఎత్తు కాగా బరిలో ఉన్న అభ్యర్ధుల్లో పలు చోట్ల రెబెల్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కూటమి అభ్యర్ధులకు పోటీగా నామినేషన్లు వేసిన వారే. దీంతో వీరిని ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలు ఇస్తున్న ఆఫర్లకు కొందరు పోటీలో నుంచి తప్పుకునే అవకాశం ఉండగా.. ఇంకొన్ని చోట్ల మాత్రం రెబెల్స్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో వీరి విషయంలో పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమిగా వార్ సాగుతోంది. ఈ క్రమంలో కూటమిలో సీట్ల సర్దుబాట్లు కీలకంగా మారాయి. దీంతో అప్పటికే టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారు చివరి నిమిషంలో జరిగిన మార్పులతో అవకాశాలు కోల్పోయారు. వీరిలో కొందరు రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగానూ, మరికొందరు చిన్నా చితకా పార్టీల తరఫున బరిలోకి దిగారు. వీరిని బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీరి ప్రయత్నాలు ఫలించకపోతే పార్టీల నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications