Onion Prices: మొన్న టమాటా... నేడు ఉల్లి; కొండెక్కుతున్న ఆనియన్ ధరలు..!!
ఆ మధ్య టమాటా ధరలు చుక్కలను తాకి సామాన్యులకు షాక్ ఇస్తే, ఇప్పుడు ఉల్లి ధరలు సామాన్యుల కళ్ళవెంట నీళ్లను తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయల ధర పెరిగితే మన వంటింట్లో బడ్జెట్ పెరగడం ఖాయం.. ఈ విషయం ఎవరు కాదనలేని సత్యం. అటువంటి ఉల్లి ధరలు ఇప్పుడు చుక్కల్ని తాకుతున్నాయి.
హైదరాబాద్లో కేజీ ఉల్లిపాయలు 70 రూపాయలకు విక్రయిస్తున్నారు అంటే ధరలు పెరుగుతాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. మొన్నటి వరకు టమాటాలు కిలో 200 రూపాయలు పలకగా, ఇప్పుడిప్పుడే కాస్త టమాటాల ధరలు తగ్గాయి కానీ, ఇప్పుడు నిదానంగా ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి.

ఇక దీపావళి పండుగ సీజన్ కావడంతో ముందు ముందు మరింత ధరలు పెరుగుతాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఉల్లి పంట బాగా దెబ్బతింది. దీనివల్ల మార్కెట్లో ఉల్లి కొరత కనిపిస్తుంది.
డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బెంగళూరులో ఉల్లి ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ సంవత్సరం ఉల్లి పంటకు అకాల వర్షాలు, అనావృష్టి రెండు దెబ్బ తీయడంతో ధరల పెరుగుదల కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు సరిగా పడకపోవడంతో కర్నూలు, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
ఇక ఈ పరిస్థితులతో ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీపావళి పండుగ సమయానికి ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి నవంబర్ రెండవ వారానికి ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండడంతో మళ్లీ ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని, ఆ చర్యలను తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు.












Click it and Unblock the Notifications