పిన్నెల్లి అరెస్ట్ లో వీడని ఉత్కంఠ: పోలీసులకే షాకిచ్చి తప్పించుకున్న మాచర్ల ఎమ్మెల్యే.. మ్యాటరిదే!!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలు మరియు వివి ప్యాట్ లు ధ్వంసం చేసిన కేసులో ఏవన్ గా నమోదు చేసిన పోలీసులు ఆయన పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.
ఇప్పటివరకు పిన్నెల్లిని పట్టుకోలేకపోయిన పోలీసులు
నిన్న ఉదయం నుంచి పోలీసుల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆయన పట్టుబడినట్లు పోలీసులు ధృవీకరించలేదు. నిన్న హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆయన ఉన్నట్టు గుర్తించిన క్రమంలో ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పటివరకు ఆయనను పట్టుకోలేక పోయాయి.

పోలీసులకే షాక్ ఇచ్చి తప్పించుకున్న పిన్నెల్లి
తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు ఇద్దరు హైదరాబాద్ నుండి పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడ ఉన్నాడో గుర్తిస్తూ ఆయనను వెంబడించిన పోలీసులు ఫైనల్ గా ఆయన కారును పట్టుకున్నారు. అయితే ఆ కారులో గన్ మెన్, కార్ డ్రైవర్ తో పాటు ఆయన సెల్ ఫోన్ మాత్రమే లభ్యం అవడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఫోన్ తో పోలీసులను తప్పుదారి పట్టించిన ఎమ్మెల్యే
దీంతో గన్ మ్యాన్ ను, కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నారు. వారిద్వారా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారులో ఫోన్ వదిలిపెట్టి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పిన్నెల్లి ఎక్కడకు వెళ్ళే అవకాశం ఉందంటే ..
లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి విమానాశ్రయాలను సైతం అప్రమత్తం చేయగా ఆయన దేశం వదిలి వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే ఆయన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో లేరని భావిస్తున్నారు. ఆయన తమిళనాడు కానీ, కేరళ కానీ వెళ్లి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన క్రమంలో డీజీపీ ఒత్తిడి మేరకు పోలీస్ అధికారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications