ఏ సెంటర్ లో అయినా తాటతీస్తాం!...కేతిరెడ్డి Vs పరిటాల
ఫ్యాక్షన్ రాజకీయాలకు, వివాదాలకు పెట్టింది పేరుగా నిలిచిన ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వరుసగా రెండుసార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తాను ధర్మవరం నుంచే పోటీచేస్తానని శ్రీరామ్ చెబుతున్నారు.

సోషల్ మీడియాలో కేతిరెడ్డిపై పోస్టులు
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులు కలకలం రేపాయి. దీంతో కేతిరెడ్డి ఆ పోస్టులపై మండిపడ్డారు. తాహతుకు మించి పోస్టులు పెడుతున్నారని, పోటుగాడు అనిపించుకోవడానికి హద్దులు మీరుతున్నారంటూ మండిపడ్డారు. కేతిరెడ్డిపై కామెంట్స్ చేస్తే హీరోలవుతామనే పిచ్చి భ్రమలో కొందరు పోస్టులు చేస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను తాము ఏం అనలేదని, కానీ మమ్మల్ని అంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

రాప్తాడులో ఓడిపోయి ఇక్కడికి వచ్చాడు..
2014లో తనను జగన్ తాడిపత్రికి పంపిస్తానంటే వద్దని చెప్పానని, 2019లో కూడా రెండోసారి గెలిచానన్నారు. కానీ పరిటాల శ్రీరామ్ రాప్తాడులో ఓడిపోయి ఇక్కడకు వచ్చారని, అక్కడ గెలిచి ధర్మవరం వచ్చివుంటే బాగుండేదన్నారు. ఎవరు ధర్మవరం వచ్చినా ఎమ్మెల్యేగా నిర్ణయించే అధికారం ప్రజలకు ఉందని, బెదిరించి రాజకీయాలు చేస్తామంటే కుదరదన్నారు. శ్రీరామ్ ఇక్కడికి వచ్చినా రాప్తాడులోని ఆయన అనుచరులే ఇక్కడికి వస్తున్నారని, కానీ తాను అలా చేయడంలేదని, తన సొంతూరివారే ఇక్కడికి రారన్నారు.

ఏ సెంటర్ లో అయినా తాటతీస్తాం..
తాడిపత్రిలో తమ చిన్నమ్మ గురించి నీచంగా మాట్లాడారని, కొందరు కావాలని వారే చేసిన ఆడియోను పోస్టు చేశారన్నారు. తాను తప్పు చేస్తే ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించాలని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏ సెంటర్ లో అయినా తాట తీస్తామని హెచ్చరించారు. వారి వారి రాజకీయ ఉనికి కోసమే తనను విమర్శిస్తున్నారన్నారు. హద్దు మీరితే ఎవరినైనా కచ్చితంగా కొడతామని హెచ్చరించారు. తన చిన్నాన్న జైలులో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ ఫోన్ చేసి రావాలని చెప్పారని, దీంతో తప్పనిసరై రాజకీయాల్లోకి వచ్చానని, అప్పుడు తమపై ఆధారపడి అనేక కుటుంబాలున్నాయని, వారికోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. ఇంట్లో భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications