నాలుక కోస్తామన్నా స్పందించరా?- చంద్రబాబు సర్కార్ పై రఘురామ ఫైర్..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju)కు సొంత పార్టీ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతోంది. ముఖ్యంగా తన నియోజకవర్గమైన ఉండిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రభుత్వం మౌనంగా ఉండటం రఘురామకు కోపం తెప్పిస్తోంది. దీంతో ఉండబట్టలేక ఇవాళ ఆయన చంద్రబాబు సర్కార్ తీరుపై మండిపడ్డారు. తన నాలుక కోస్తామని ప్రత్యర్దులు బెదిరిస్తున్నా రాజ్యాంగ పదవిలో ఉన్న తనకు రక్షణ కల్పించరా అంటూ రఘురామ ప్రశ్నించారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉన్నప్పటికీ , క్రైస్తవం, ఇస్లాంలోకి మారిన వారికి మాత్రం ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవన్న అంశం కూడా ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్లీ చెప్పిందని రాజ్యాంగ పదవిలో ఉన్న తాను చెప్తే.. నా నాలుక కోసి, నా సమాధి చేస్తామని ఒక వ్యక్తి బరితెగించి మాట్లాడితే, అతనిపై చర్యలు తీసుకోలేని స్దితిలో ప్రభుత్వం ఉందని రఘురామ ఆరోపించారు. ఇలాంటి పరిస్ధితి ఏ రాష్ట్రంలోనూ ఉండదన్నారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడే అన్నారు.

మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులో ఇటీవల నిర్వహించిన సభలో గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రజలు వ్యతిరేకించిన తీరు, ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో… pic.twitter.com/i2NBAOobyA
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 1, 2026
రాజ్యాంగ పదవిలో ఉన్న తనను, రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుక కోస్తానని బెదిరించిన తర్వాత కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే, హోంశాఖకు అర్దం లేదు, వ్యర్ధం అని చెప్పేందుకు తాను వెనుకాడటం లేదన్నారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో తనను పెట్టడం ఎందుకని, రాజ్యాంగాన్ని పాటించాలని సూచిస్తే చంపేస్తానని బెదిరిస్తుంటే మాట్లాడరా, అరెస్టు చేయరా అని ప్రభుత్వాన్ని రఘురామ ప్రశ్నించారు. ఇవాళ, రేపట్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. సీఎంపై విమర్శలు చేస్తున్న వారికి జరిగినది, రాజ్యాంగ పదవిలో ఉన్న తనను విమర్శించే వారిపై చర్యలు తీసుకోలేని అచేతన స్దితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకోవాలంటే రాజ్యాంగంపై దాడులు చేసే వారిని శిక్షించాలన్నారు.














Click it and Unblock the Notifications