రాజధానిలో ఉష్ణోగ్రతల తగ్గుదలకు చర్యలు:సిఎం ఆదేశించారు...అధికారులు పాటిస్తున్నారు
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సిఆర్‌డిఎ అభివృద్ధి పనుల పురోగతిపై సిఎం నేతృత్వంలో అథీకృత సమావేశం గురువారం సెక్రటేరియట్ లో జరిగింది.
Recommended Video

ఈ సందర్భంగా కొత్త రాజధానిలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ప్రజెంటేషన్లను సిఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అమరావతిలో ఉష్ణోగ్రతల తగ్గుదలకు చేపడుతున్న చర్యల గురించి అధికారులు ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు తెలియజేశారు. అయితే పోలవరంతో పోల్చితే అమరావతి పనులు చురుగ్గా సాగటం లేదని ఆయన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పోలవరం చురుగ్గా...ఇక్కడ మందకొడిగా:సిఎం
సెక్రటేరియట్ లో గురువారం సిఆర్‌డిఎ అభివృద్ధి పనుల పురోగతిపై సిఎం నేతృత్వంలో జరిగిన 17వ అథీకృత సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో ముందుగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులతో పోలిస్తే అమరావతి పనులు అంత చురుగ్గా సాగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ విషయాన్ని కూడా ముందుగానే దృష్టిలో పెట్టుకొని పనులు నిరాటంకంగా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం అమరావతి 3డి సిటీ డిజైన్లపై ఇంటర్నేషనల్ కంపెనీ 'డస్సాల్ట్ సిస్టమ్స్' ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిఎం వీక్షించారు.

ఉష్ణోగ్రత తగ్గుదలకు...సిఎం దిశానిర్దేశం
నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ప్రజెంటేషన్లను ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు పరిశీలించారు. అమరావతిలో "ప్రత్యేక కూలింగ్ సిస్టమ్"ను సింగపూర్ పవర్ సంస్థ చేపడుతోందని అధికారులు సిఎంకు తెలిపారు. ప్రతి 440 మీటర్లకు కూల్ స్పాట్స్ ఏర్పాటుతో కొంతమేర ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశ ముందని అధికారులు ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు వివరించారు.

హైకోర్టు భవనాలకు...టెండర్ల ప్రక్రియ
హైకోర్టు భవంతుల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతోందని, రూ 1685 కోట్లతో ఐకానిక్ భవనంగా వాటిని నిర్మిస్తున్నామని సిఆర్డీఏ ఛైర్మన్ చెరుకూరి శ్రీధర్ సిఎం చంద్రబాబుకు తెలిపారు. ప్రి ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో రాజధానిలో మూడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని చేపట్టేందుకు 'ఫార్చ్యున్ మురళి ' యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ. 2 వేల కోట్లు విలువ చేసే 'అమరావతి బాండ్ల'ను వచ్చే నెల ఆరో తేదీ తర్వాత ఆర్‌బిఐ పాలసీ ప్రకటన అనంతరం విడుదల చేస్తామన్నారు. అన్న క్యాంటీన్ నిర్మాణ ఆకృతులను సిఎం ఈ సమావేశంలో పరిశీలించారు.

స్ఫూర్తి కోసం...రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్రాభివృద్ధి సాధించాలనే స్ఫూర్తి, పట్టుదల, అంకితభావం పెంపొందించేందుకే రాష్ట్ర చిహ్నాలుగా వేపచెట్టు, మల్లెపూవు, రామచిలుక, కృష్ణజింకలను ఎంపిక చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో చెప్పారు. ఆయా చిహ్నాల ప్రత్యేకతల గురించి చంద్రబాబు అధికారులకు వివరించారు. ఆయుర్వేదంలో ఎన్నో సుగుణాలున్న వేపచెట్టు స్వచ్ఛమైన గాలినిస్తుందని, మల్లె పూవులానే రాష్ట్రం కూడా అందంగా, సమస్త సుగుణాలతో విలసిల్లాలన్నారు. రామచిలుకలా రాష్ట్రం ఆహ్లాదం, శోభాయమానంగా, తెలివి, సమయస్పూర్తి, భవిష్యత్ దిశగా సాగాలన్నారు. కృష్ణజింకలా ఏపి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, చురుకుగా సాగిపోవాలన్నారు.












Click it and Unblock the Notifications