చంద్రబాబుకు అంతుపట్టని ఆ ఎమ్మెల్యే! ఓవైపు వార్నింగ్ లు, మరోవైపు క్షమాపణలు..!
ఏపీలో కూటమి సర్కార్ తాజాగా వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీనిపై క్షేత్రస్దాయి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకుంది. ఇందులో పలువురు ఎమ్మెల్యేల తీరుపై జనంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తేలింది కూడా. వీరిపై ఇప్పటికే చంద్రబాబు దృష్టిసారించారు. పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డపేరు తీసుకురావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా వీరిలో కొందరు మాత్రం ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. దీంతో వీరిని ఏం చేయాలనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇందులో మొదటి పేరు తిరువూరు సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావుదే. దళిత సామాజిక వర్గానికి చెందిన కొలికపూడికి అమరావతి ఉద్యమంలో గట్టిగా పనిచేసారన్న పేరు రావడంతో తిరువూరు సీటు ఇచ్చి గౌరవించారు. కానీ ఆయన ఎన్నికల సమయంలోనే తన వివాదాస్పద వైఖరితో చర్చల్లో నిలిచారు. అప్పట్లో పార్టీ సీనియర్ నేతలు కొందరు ఆయనతో మాట్లాడి వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పూ లేదు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి వ్యవహారశైలి మరింత వివాదాస్పదంగా మారింది. రాజకీయ ప్రత్యర్ధులతో పాటు పార్టీలో ప్రత్యర్ధుల్ని, జర్నలిస్టుల్ని కూడా బహిరంగంగానే దూషించడం, మహిళలపై వేధింపుల ఆరోపణలు, రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇలా ఒకటీ రెండూ కాదు. కొలికపూడి అంటేనే వివాదాస్పద ఎమ్మెల్యే అన్నట్లుగా ఆయన మారిపోయారు. తాజాగా తిరువూరులో భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్దమైన ఆయన.. అధినేత చంద్రబాబు నుంచి వచ్చిన పోన్ కాల్ తో దాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగసభలో క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలతో ఆత్మహత్యాయత్నం చేసిన సర్పంచ్ కుటుంబానికి కూడా సారీ చెప్పినట్లు తెలుస్తోంది.
అనంతరం తనపై మరిన్ని ఆరోపణలు రావడంతో వీటిపై వివరణ ఇస్తానంటూ నిజం గెలవాలి పేరుతో ఇంట్లో దీక్ష ప్రారంభించారు. దీన్ని విరమింపజేసేందుకు అధిష్టానం కష్టపడాల్సి వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో ఫోన్ చేయించి సస్పెన్షన్ చేస్తామని హెచ్చరికలు చేయడంతో దీక్షను కొలికపూడి విరమించుకున్నారు. ఇలా ప్రతీ రోజూ ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తున్న కొలికపూడి కారణంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీతో పాటు కూటమి సర్కార్ కూ చెడ్డపేరు వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.












Click it and Unblock the Notifications