వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ స్పీకర్ సిరికొండ: మండలి చైర్మన్ స్వామి గౌడ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana speaker may be sirikonda?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా వరంగల్ జిల్లా భూపాలపల్లి శాసనసభ్యుడు సిరికొండ మధుసూదనాచారి ఎన్నిక కానున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ఎల్పీ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీకి కాబోయే స్పీకర్ అంటూ మధుసూదనాచారిని ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మకు పరిచయం చేశారు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ మొదటి స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కెసిఆర్, పార్టీ అధిష్ఠానం ముఖ్యులు తీవ్రమైన కసరత్తు చేశారు. మధుసూదనాచారి పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కావటం, తెరాస స్థాపనలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా, పార్టీ విధాన నిర్ణయాల ఖరారులో కీలక భాగస్వామిగా ఉండటం, ప్రారంభం నుంచి టీఆర్ఎస్ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, అన్ని వేళల్లో పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కు అత్యంత విధేయుడిగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు.

వాస్తవానికి తొలుత అసెంబ్లీ స్పీకర్ పదవికి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. మంత్రివర్గంలోకి మధుసూదనాచారిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ పదవి చేపట్టటానికి ఇష్టపడలేదు, మంత్రి పదవి చేపట్టి క్షేత్రంలో ఉండాలనుకున్నారు. దీంతో కెసిఆర్ ఆయన అభ్యర్థనను మన్నించారు. ఒక దశలో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం సామాజిక సమీకరణాల రీత్యా ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్ (దళితుడు-మాల), అజ్మీరా చందూలాల్ (ఎస్టీ-లంబాడీ) పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం ముఖ్యులు పరిశీలనలోకి తీసుకున్నారు.

అయితే తనకు భాష సమస్యగా ఉంటుందని ఈశ్వర్ నిజాయితీగా తన లోపాన్ని అధిష్ఠానానికి నివేదించినట్లు తెలిసింది. అజ్మీరా చందూలాల్‌కు కూడా అదే సమస్య ఉన్నట్లు పార్టీ ముఖ్యులు గుర్తించారు. ఈ క్రమంలో మధుసూదనాచారిని మించిన సమర్థుడు దొరకకపోవటంతో పార్టీలో సీనియర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ పేరు కూడా మంత్రివర్గ జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించి ఆయన స్థానంలో తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి పేరు చేర్చినట్లు తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే స్వామిగౌడ్‌ను తన కేబినెట్‌లోకి తీసుకొని ఉద్యోగుల శాఖను అప్పగిస్తానని కేసీఆర్ అనేకమార్లు బహిరంగంగా చెప్పారు. కానీ ఆయనకు తొలి విడతలో చోటు దక్కలేదు.

దీంతో స్వామిగౌడ్‌ను అసలు మంత్రివర్గంలోకి తీసుకుంటారా ? లేదా ? అనే అంశం పార్టీ ముఖ్యుల చర్చల్లో ప్రస్తావనకు వస్తోంది. ఆయన ప్రస్తుతం శాసనమండలిలో పార్టీపక్ష నేతగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో టీఆర్ఎస్‌కు నలుగురు సభ్యులే ఉన్నారు. చైర్మన్‌గా ఎన్నిక కావడానికి అవసరమైన మెజార్టీ లేదు. ఓటింగ్ అనివార్యమైతే మండలిలో మెజార్టీ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చైర్మన్ అవుతారు. అయితే మెజార్టీ తక్కువగా ఉన్నప్పటికీ, శాసనసభలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారే మండలిలో చైర్మన్‌గా ఉండడం సంప్రదాయంగా వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా మండలి చైర్మన్‌గా ఎన్నికైనప్పటికీ, ఆయనకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహాకారాలు అందకపోవచ్చని అంటున్నారు. ఈ చిరాకు ఉంటుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ మండలి చైర్మన్ పదవి తీసుకోకపోవచ్చని, టీఆర్ఎస్‌కే ఆ పదవి దక్కవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు స్వామిగౌడ్‌ను తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా నియమించే అవకాశాలను తోసిపుచ్చలేమని తెరాస ముఖ్యులు కొందరు అంటున్నారు. అందుకే ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదని చెబుతున్నారు.

English summary
It is said that Warangal district Bhupalapalli MLA Sirikonda Madhusudanachari may be first Telangana assembly speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X