'ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి దెబ్బతిన్నాం, కోట్లను ఓడించినప్పడు ఆనందపడ్డా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి తప్పు చేశామని తెలుసుకొన్నామని ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.కర్నూల్ జిల్లాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని ఓడించిన సమయంలో చాలా ఆనందపడ్డానని కెఈ చెప్పారు.2019 ఎన్నికల్లో తన ఇద్దరు కుమారులు రాజకీయాల్లోకి వస్తారని ఆయన చెప్పారు.కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలో చేరడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని చంద్రబాబునాయుడుకు చెప్పానని కెఈ చెప్పారు.

నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్


సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో కొనసాగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తిని ఎబిఎన్ ఆంద్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలోకి కెఈ కుటుంబం ఎలా వచ్చిందనే విషయాన్ని కెఈ ప్రస్తావించారు.కర్నూల్ జిల్లాలో గతంలో కొనసాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రస్తుతం లేవని కెఈ అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ ముక్కుసూటిగా మాట్లాడేవారని కెఈ చెప్పారు.రాజకీయాల్లోకి వచ్చిన కాలం నుండి తాను నైతిక విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తున్నానని కెఈ అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి దెబ్బతిన్నాం

ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి దెబ్బతిన్నాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో తన మంత్రివర్గం నుండి ఎన్టీఆర్ ఒకేసారి 31 మందిని తొలగించారు. అలా ఎందుకు మమ్మల్ని మంత్రివద్గం నుండి తొలగించారో తెలియదన్నారు కెఈ.. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్పారు. దీనికి తోడు మంత్రిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మమ్మల్ని అవమానించేలా మాట్లాడారని కెఈ గుర్తుచేశారు. అప్పుడు ఎన్టీఆర్‌తో మమ్మల్ని మాట్లాడించాలని చంద్రబాబును అడిగాం. ఎన్టీఆర్ మాత్రం మాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ ఆవేశంలో పార్టీ పెట్టాం. ఆ తర్వాత మేమే ఆవేశపడ్డాం అని అనిపించింది.

కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలోకి గ్రీన్ సిగ్నల్

కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలోకి గ్రీన్ సిగ్నల్

కర్నూల్ మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని టిడిపిలో చేర్చుకొనే విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనతో చర్చించారని ఆ ఇంటర్వ్యూలో కెఈ కృష్ణమూర్తి చెప్పారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలో చేరితే తనకు . ఏం అభ్యంతరం లేదని చెప్పానని ఆయన గుర్తుచేశారు.. బాబుగారేంటంటే.. చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ చేర్చుకోవాలి. అవతలి పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నారు. అందుకే ఎవరు వచ్చినా తీసుకుంటున్నాం. బుట్టా రేణుక విషయంలో ఆక్షేపణ లేదని చెప్పామన్నారు.సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడరనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చేసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో ఉంటుందని కెఈ చెప్పారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం నుండి చాలా డిమాండ్లున్నాయన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిని చేయాలని డిమాండ్లు కోట్ల కుటుంబం నుండి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. అయితే చంద్రబాబుకు విసుగొచ్చి వదిలేయమన్నారు.

కాంగ్రెస్ నుండి టిడిపిలోకి రావడానికి కారణమిదే

కాంగ్రెస్ నుండి టిడిపిలోకి రావడానికి కారణమిదే

1983 లో టిడిపిలో చేరాలని మా నాన్నను ఎన్టీఆర్ ఆహ్వనించారని కెఈ కృష్ణమూర్తి చెప్పారు. అప్పటికే మా కుటుంబం కాంగ్రెస్‌లో ఉండి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ కోరినా పార్టీ మారలేనని మా నాన్న చెప్పారు. 1984, 85ల్లో మరోసారి చంద్రబాబు, ఉపేంద్రను ఎన్టీఆర్ పంపారు. నాన్న కూడా వెళ్లమన్నారు. టీడీపీ అభ్యర్థికే మద్ధతు ఇస్తానని ప్రకటించారు. అయ్యపురెడ్డిని పెట్టి విజయభాస్కర్‌రెడ్డిని ఓడించారు. దీంతో రామారావు గారి దగ్గర మా మీద ఓ ఇంప్రెషన్ పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 85లో నేను ఎమ్మెల్యేగా గెలవగానే మేజర్ ఇరిగేషన్ ఇచ్చారు.1978 లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో రూ.3 లక్షలు ఖర్చు చేసినట్టు కెఈ గుర్తు చేసుకొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విలువలతో కూడిన రాజకీయాలు చేశాను. మా కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా తొలిసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి లభించింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగానే ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారని కెఈ చెప్పారు.

కోట్ల కుటుంబం ఓటమితో గ్రూపుల గొడవలు

కోట్ల కుటుంబం ఓటమితో గ్రూపుల గొడవలు

1938లోనే డీసీసీ ఉండేది. అందులో మా నాన్న కేఈ మాదన్న డైరెక్టర్‌గా పోటీ చేశారు. విజయభాస్కర్ రెడ్డి వాళ్ల చిన్నాయన ఓడిపోయారు. అప్పటి నుంచి కక్షలు మొదలయ్యాయి. మాకు సంబంధం లేకున్నా గ్రామాల్లో పల్లెలన్నీ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఫ్యాక్షనిజమే లేదన్నారు.సంజీవయ్యను ఓడించిన విజయభాస్కర్ రెడ్డిని ఓడించాలని ఎంతో కోరికగా ఉండేది. ఆయన్ని ఓడించినప్పుడు ఎంతో ఆనందపడ్డా. ఎన్టీఆర్ టైంలో ఏ తప్పు చేయకుండా పదవి నుంచి తొలగించడం అనేది చాలా బాధపడ్డ సంఘటనగా కెఈ కృష్ణమూర్తి గుర్తు చేశారు.2014లో రాయలసీమ రాజకీయాలు చూసి ఒక వర్గంతో పోరాటం జరపాలి కాబట్టి హోమ్ మంత్రి పదవి వద్దనుకున్నారేమోనని కెఈ చెప్పారు. నాపై సీఎంకు కొంచెం గౌరవం ఎక్కువ. నాకు చంద్రబాబుపై చాలా గౌరవం ఉందన్నారు కెఈ.

బిజెపితో గ్యాప్ ఉన్న మాట వాస్తవమే

బిజెపితో గ్యాప్ ఉన్న మాట వాస్తవమే

ఇప్పటికున్న అంచనా ప్రకారం 2019 ఎన్నికల్లో మోదీ గెలవచ్చని కెఈ అభిప్రాయపడ్డారు.. మేం బీజేపీకి మిత్రపక్షం ఏదీ నేరుగా చెప్పకూడదు. కాబట్టి మోదీయే గెలుస్తారని చెప్పాల్సి వస్తోంది. టీడీపీతో ఉన్నంత కాలం తాము ఎదగమేమోనన్న అనుమానం బీజేపీకి ఉంది. అందుకే వాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.రాష్ట్రానికి రావాల్సినంత సాయం రావడం లేదని కెఈ అభిప్రాయపడ్డారు. దాని వల్ల పెద్ద నష్టం లేదేమో. మోదీ ప్రవర్తన కూడా వేరేగా ఉంది. మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందా అన్న ఆందోళన మాలో కూడా ఉంది.2019 ఎన్నికల్లో తన రెండో కుమారుడు శ్యాంబాబు పత్తికొండ నుండి బరిలోకి దిగనున్నట్టు కెఈ కృష్ణమూర్తి చెప్పారు.

 2019లో జగన్ సీఎం అయ్యే అవకాశం లేదు

2019లో జగన్ సీఎం అయ్యే అవకాశం లేదు

2019 లో ఏపీ రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తోందని కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్ ఇంకా రాజకీయంగా ఎదగలేదని కెఈ చెప్పారు.. పాదయాత్ర అన్నారు. మళ్లీ బీసీలను పట్టుకున్నారు. గర్జనలు పెడతా అంటున్నాడు. కచ్చితంగా బీసీలు ఆయనతో ఉండరు. అసలు జగన్‌ ఒక విషయం మీద ఉండరు. నంద్యాల ఎన్నికల్లో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారని కెఈ గుర్తుచేశారు. ఏమీ చేయకుండా మాట్లాడడం వల్లే జగన్‌తో ఇబ్బందులు వస్తున్నాయని కెఈ అభిప్రాయపడ్డారు.జగన్‌ పాదయాత్ర చేసినా ఏ నినాదాలు ఇచ్చినా ఏం ఒరగదన్నారు. జగన్‌ ప్రజలు, సొంత పార్టీ నాయకుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని కెఈ అభిప్రాయపడ్డారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేననే ధీమాను కెఈ వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We will get power in 2019 elections also said Ap Deputy CM K.E. Krishnamurthy. A Telugu News channel interviewed KE Krishnamurthy on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి