Year Ender 2023: ఈ ఏడాది జగన్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఏడాది ఎన్నికలకు సొంత పార్టీ వైసీపీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సాధించిన వైఎస్ జగన్ కు మరోసారి పార్టీని అదే స్దాయిలో గెలిపించడం కచ్చితంగా కత్తిమీద సామే కానుంది. అయితే కనీసం అధికారం నిలబెట్టుకుంటే మాత్రం జగన్ కు అది గొప్ప విజయమే అవుతుంది. ఎందుకంటే ఏపీ విభజన తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సాధిస్తారు. అయితే అంతకంటే ఎక్కువగా జగన్ ఈ ఏడాది ఓ అరుదైన విజయం సాధించారు.
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పి, అనంతరం జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన రాజకీయ ఉద్దండుడిగా ప్రచారం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఓ కేసులో అరెస్టు చేస్తారనే మాట ఊహకు కూడా ఎవరికీ అందేది కాదు. ముఖ్యంగా అధికారం కోల్పోయి గతంలో పదేళ్లపాటు విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సైతం ఆయన్ను ఓ కేసులో అరెస్టు చేయలేకపోయారు. అలాంటి చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడం అంటే మామూలు విషయం కాదు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ సర్కార్ .. తొలిసారి జైలుకు పంపింది. స్కిల్ స్కాంలో నంద్యాలలో అరెస్టు అయిన చంద్రబాబును ఆ తర్వాత సీఐడీ కోరిన మేరకు ఏసీబీ కోర్టు రాజమండ్రి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపింది. అక్కడి నుంచి రాష్ట్రంలో రాజకీయమే మారిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ పై బయటికి వచ్చినా ఇప్పటికీ జైలు జ్ఞాపకాలు ఆయనకు వెంటాడుతునే ఉన్నాయి. గతంలోలా ఆయన దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.

ఇలా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబును, అదీ గతంలో స్టేలపై స్టేలు తెచ్చుకుని కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకున్న చంద్రబాబును అరెస్టు చేయడం, జైలుకు పంపడం, బెయిల్ కోసం కూడా కష్టపడే పరిస్ధితి తీసుకురావడం వైఎస్ జగన్ ఈ ఏడాది సాధించిన అతిపెద్ద విజయంగా ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబును అరెస్టు చేశాక ఏకంగా 52 రోజుల పాటు జైల్లో ఉంచగలగడం కూడా జగన్ గొప్పతనంగానే ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది రాజకీయంగా జగన్ .. విపక్ష నేత చంద్రబాబు కంటే పైచేయి సాధించినట్లయింది.












Click it and Unblock the Notifications