సూపర్ సిక్స్ -సూపర్ ఫ్లాప్ ..! ఎలాగో చెప్పేసిన వైఎస్ షర్మిల..!
ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని నిన్న ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్-సూపర్ హిట్ అని సగర్వంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశామనేది దీని సారాంశం. దీనిపై స్పందించిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల సూపర్ సిక్స్-సూపర్ ప్లాప్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది చంద్రబాబు గారూ అంటూ షర్మిల ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా?, నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా ?, 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా ?, అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చి కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారని, 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని షర్మిల విమర్శలు గుప్పించారు.

అలాగే తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారని, రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారని షర్మిల విమర్శించారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసమని, రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లిందని షర్మిల విమర్శించారు.
అభివృద్ధి అటకెక్కిందని, సుపరిపాలన కొండెక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం..
అమలు మాత్రం అరచేతిలో వైకుంఠమని షర్మిల తేల్చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ముందు నుంచీ విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల.. తాజాగా ఇవన్నీ సూపర్ ఫ్లాప్ అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications