ys Sharmila: చంద్రబాబు, పవన్ నుద్దేశించి షర్మిల ప్రకటన- కీలక సూచనలు..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణాజిల్లా కేసరపల్లి వద్ద ఉన్న మేథా టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ తో పాటు మరో 23 మంది ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వీరికి శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు, పవన్ తో పాటు మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు షర్మిల తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు తమను ఎంతో కలచివేశాయని షర్మిల పేర్కొన్నారు. వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదని కొత్త ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాశారు.

సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదని, ఉండకూడదని షర్మిల ఆకాంక్షించారు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని షర్మిల తెలిపారు.
గత ఐదేళ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారని షర్మిల వారికి తెలిపారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైఎస్సార్ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మీకున్న అనుభవముతో, పెద్దమనసు, నిస్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications