గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్... మరో ఏడుగురి అరెస్ట్...
గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్ కేసులో మరో ఏడుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఏ-1 వరుణ్,ఏ-2 కౌశిక్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు... తాజాగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది. ఇందులో వరుణ్ ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు తీయగా... కౌశిక్ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి తర్వాత మణికంఠ,ధనుంజయ్ రెడ్డి అనే వ్యక్తులు ఆమె ఫోటోల లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

మై నేమ్ ఈజ్ 420..
మణికంఠ అనే యువకుడు 'మైనేమ్ ఈజ్ 420' అనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విద్యార్థిని న్యూడ్ వీడియోలను లీక్ చేసినట్లు గుర్తించారు. వీడియోతో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి... మరింతమంది అమ్మాయిల వీడియోలు పంపించాలని ఆమెను బెదిరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీ అడ్రస్,కాల్ డేటా ఇతరత్రా ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ధనుంజయ్ రెడ్డి అనే యువకుడు భాస్కర్ అనే స్నేహితుడి ద్వారా బాధితురాలి వీడియోను సంపాదించి.. దాన్ని తన స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన మిగతా యువకులు కూడా నేరపూరిత ఉద్దేశంతోనే బాధితురాలి వీడియోను సర్క్యులేట్ చేసినట్లు గుర్తించారు.

మరో నలుగురిని పట్టుకుంటామన్న పోలీసులు...
బాధితురాలు చదివిన బీటెక్ కాలేజీ నుంచే మణికంఠకు ఆ వీడియోలు అందినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వాటిని మణికంఠకు ఎవరిచ్చారు... అసలు మణికంఠ ఇందులోకి ఎలా వచ్చాడన్న దానిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురైదుగురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సరైన సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామని... ఆధారాలు లభించగానే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఇద్దరు యువతుల ప్రమేయం..
వరుణ్,కౌశిక్‌ల నుంచి వీడియోలు లీక్ కావడంలో ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్లు వారం క్రితం కథనాలు వచ్చాయి. వీరిద్దరిని కూడా పోలీసులు త్వరలోనే పట్టుకునే అవకాశం ఉంది. వీరిద్దరు రూమ్ మేట్స్‌గా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు వరుణ్ గర్ల్‌ఫ్రెండ్ కాగా,మరొకరు కౌశిక్ సోదరిగా గుర్తించినట్లు సమాచారం.

మూడేళ్ల క్రితం...
మూడేళ్ల క్రితం బాధితురాలు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా వరుణ్ అనే యువకుడు ఆమెకు దగ్గరై.. స్నేహం ముసుగులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఆ సమయంలో అతను యువతి నగ్న ఫోటోలు,వీడియోలు చిత్రీకరించాడు. అప్పటినుంచి వరుణ్‌ను ఆమె దూరం పెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకే కౌశిక్ పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు వరుణ్ వద్ద ఉన్న వీడియోలను సంపాదించి... కౌశిక్‌కి చూపించి పెళ్లి ప్రపోజల్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు యువతులే కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. తాను మోసపోయానన్న ఆగ్రహంతో కౌశిక్ ఆమె వీడియోలను పోర్న్ సైట్లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications