పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ చేయాలని హరీశ్ అడిగారు, కానీ: మల్లారెడ్డి ఆసక్తికరం
హైదరాబాద్: తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తాజాగా, మరోసారి తన శైలిలో స్పందించారు. తనకు సినిమాలో విలన్ అవకాశం వచ్చిందన్నారు. హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కెట్ నిర్మించిన 'మేం ఫేమస్' సినిమా చిత్రం టీచర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మల్లారెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఫేమస్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. యువతను ఉద్దేశించిన మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ వేసుకుని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవరని హితవు పలికారు. రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని మల్లారెడ్డి చెప్పారు. తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని.. తన వద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని మంత్రి తెలిపారు.

కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారని, దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల కుర్రళ్లేనని చెప్పుకొచ్చారు మంత్రి మల్లారెడ్డి. ఒకప్పుడు తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఖ్య పెరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
యవత కష్టపడి పనిచేసి సక్సెస్ ను అందుకోవాలని చెప్పారు. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని మంత్రి సూచించారు. ఇటీవల సినీ దర్శకుడు హరీశ్ శంకర్.. తన నివాసానికి వచ్చి తనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్‌గా నటించమని గంటన్నరసేపు బతిమిలాడారని.. కానీ, తాను సున్నితంగా చేయనని చెప్పానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దీంతో అక్కడున్న యువత అంతా మల్లారెడ్డి హీరో అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.












Click it and Unblock the Notifications