ముసురేసిన తెలంగాణ: కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, తడిసిముద్దయిన భాగ్యనగరం
తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు ముసురు కమ్మేసింది. దీంతో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా.. ఇంకొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో వాగులు, చెరువులు నిండుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోజంతా ముసురు పట్టింది. చెరువులు అలుగులు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. మట్టి రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. భారీ వర్షాల వల్ల ఇరు రాష్ట్రాల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

నిండుకుండలా ప్రాజెక్టులు
గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన వాగుకు వరదనీరు పోటెత్తడంతో ఒక గేటు ఎత్తి వేశారు.
Recommended Video


బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
హైదరాబాద్‌లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అడుగుమేర గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు సింగరేణి ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాలలో కేకే, ఆర్‌కేపీ, ఎస్‌ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications