MLAs Poaching Case: ఆ ముగ్గురికీ బెయిల్ - కండీషన్స్ అప్లై..!!
Bail for MLAs Poaching case Accused: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మెయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కోసం ఈ ముగ్గురు బేరసారాలు చేసారనే అభియోగం తో వీరిని అరెస్ట్ చేసారు. దాదాపు నెల రోజులుగా వీరు రిమాండ్ లో ఉన్నారు. రాజకీయంగా సంచలనానికి కారణమైన ఈ ముగ్గురు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ ముగ్గురు జరిపిన సంభాషనల వీడియోలను సీఎం కేసీఆర్ స్వయంగా బయట పెట్టారు. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ తో పాటుగా మరి కొందరి పేర్లను వీరు ప్రస్తావించటం సంచలనంగా మారింది. ఇక, ఇప్పుడు ఈ ముగ్గురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో అరెస్టయిన ముగ్గురికీ బెయిల్ లభించింది. బెయిల్ పిటీషన్ విచారించిన హైకోర్టు రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.
నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసులో ఏ2గా ఉన్న నందకుమార్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎల్. రవి చందర్ వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వులను నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు.

ఈ ముగ్గురూ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో మెయినాబాద్ ఫాం హౌస్ లో బేరసారాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరికి ఎవరి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేసారు. వీరితో పాటుగా ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
సిట్ అధికారులు ఈ ముగ్గురినీ విచారించి అనేక అంశాలను రాబట్టారు. వీరితో సంబంధాలు ఉన్న నేతల వివరాలను సేకిరించారు. సేకరించిన ఆధారాలను సిట్ ఇప్పటికే హైకోర్టుకు సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇక, ఇప్పుడు ఈ ముగ్గురికీ బెయిల్ రావటంతో, ఈ వ్యవహారంలో పాత్రధారుల పైన సిట్ ఫోకస్ పెట్టింది.












Click it and Unblock the Notifications